22-10-2025 01:46:52 AM
ఖైరతాబాద్; అక్టోబర్ 21(విజయ క్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అంచలంచెలుగా వైద్యం చేరేలా ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు కాంగ్రెస్ పాలనలో సుస్తీ చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ ప్రజారోగ్యాన్ని పక్కకు పెట్టి తమ స్వార్థపూరితపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని గురుబహ్మనగర్ బస్తీదవాకఖానను మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా బస్తీ దవాఖాన వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి 6000 పడకల సామర్థ్యం గల టిమ్స్ (తెలంగాణ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) హాస్పిటల్స్‌కు శ్రీకారం చుట్టి 90 శాతం పనులు పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని దుయ్యబట్టారు.
టీ డయాగ్నస్టిక్ ద్వారా రక్త పరీక్షలు, ఈసీజీ ,ఆల్ట్రా సౌండ్ వంటి సర్వీసులు ప్రారంభించి 24 గంటలు రోగుల మొబైల్ ఫోన్లకు రిపోర్టు అందించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని గాలికి వదిలేసిందని విమర్శించారు. బస్తీ దావాఖానల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదని, తద్వారా వాళ్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇప్పటికైనా దవాఖానాల పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు వైద్య సిబ్బంది నాలుగు నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఒక్కో ఆస్పత్రి వద్ద వెయ్యి మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలతో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నేతలు జేజోల్లా రాజు ముదిరాజ్, బసవ గౌడ్,నాగరాజు, శ్రీను, చందు, శ్రీదర్ యాదవ్, జెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి : హరీశ్‌రావు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తావించారు. షేర్ లింగంపల్లి బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ ప్రస్తు త పరిస్థితులను ఎత్తిచూపుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగుల కు ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని చెబుతారు, కానీ సిబ్బందికి వేతనాలే రావడం లేదు. అని వైద్య సిబ్బంది ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించారు.
బస్తీ ప్రజలను సుస్తీ చేసి నయం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ బస్తీ దవాఖానలు ప్రారంభించారని పేర్కొన్నారు. వైన్ షాపుల టెండర్ల పెంపుతో కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచన తప్ప ప్రజా ఆరోగ్యంపై సర్కార్‌కు ఆలోచన లేదు, అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో బస్తీ దవాఖానలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రజలు కూడా ప్రశంసించడం లేదని తెలిపారు.
హైదరాబాద్ నాలుగు దిక్కుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలనే ప్రణాళికను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించగా, రేవంత్ పాలనలో పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. బస్తీ దవాఖాన సిబ్బందికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని,ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.