calender_icon.png 22 October, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య

22-10-2025 01:46:42 AM

-కారుతో ఢీకొట్టి గొంతు కోసిన దుండగులు

-భార్యా భర్తల మధ్య కొద్దికాలంగా వివాదాలు

-విచారణ చేపట్టిన పోలీసులు

-ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో ఘటన 

-ఉలిక్కిపడిన గ్రామస్తులు

నూతనకల్(ఆత్మకూరు ఎస్), అక్టోబర్ 21 (విజయ క్రాంతి ): పట్టపగలు గ్రామం నడిబొడ్డున ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెంది కొరివి మల్లయ్య, భిక్షమమ్మ దంపతులకు మధ్య వివాదాలు నడుస్తున్నాయి.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఉన్న తగాదాను పెద్దల సమక్షంలో మాట్లాడి వస్తుండగా గ్రామం నడిబొడ్డున గుర్తు తెలియని వ్యక్తులు వీధిలో నడిచి వస్తున్న భిక్షమమ్మ (39)ను వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి కిందపడిన ఆమెను కత్తితో గొంతుపై దారుణంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త మల్లయ్య లారీ డ్రైవర్ గా పనిచేస్తుండగా వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు భరత్ హైదరాబాదులో మెకానిక్ గా పని చేస్తుండగా చిన్న కొడుకు ప్రవీణ్ సూర్యాపేటలో ఓ చికెన్ సెంటర్ లో పనిచేస్తున్నాడు.

మృతరాలు భిక్షమమ్మ ఇతరులతో సన్నిహితంగా ఉంటుందని  భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులు తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెతో గొడవ పెట్టుకునేవారన్నారు. ఈ విషయమై పెద్దలు పలుమార్లు పంచాయితీలు చేసి సర్ది చెప్పినట్లు తెలిసింది. ఇటీవల సూర్యాపేటకు చెందిన ఒక దేశగురువు భిక్షమమ్మతో చనువుగా ఉండడంతో కుటుంబ సభ్యులు వారి ఇద్దరిని మందలించారన్నారు. తీరు మార్చుకోని భిక్షమమ్మను మంగళవారం భర్త మల్లయ్య పెద్దల సమక్షంలో మందలించేందుకు స్థానిక గల ఒక పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారన్నారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించిన కొద్దిసేపటికే భిక్షమమ్మ ఆ పార్టీ కార్యాలయ సమీపంలో దారుణ హత్యకు గురైంది. 

సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్‌తో క్లూజ్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించి, ఆదారాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.పట్టపగలు ఇంత సాహసోపేతంగా హత్యకు పాల్పడటం చూస్తే ఇది పక్క ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. నడిరోడ్డు పై మహిళను దారుణంగా హత్య చెయ్యడంతో తమకు రక్షణ కరువైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతురాలి భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులతో పాటు, దేశ గురువు కుటుంబ సభ్యులు , మల్లయ్య అన్న కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నట్లు సమాచారం.