calender_icon.png 22 October, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వికసిత భారత్’ వైపు పయనిద్దాం!

22-10-2025 01:03:58 AM

  1. శ్రీరాముడే మనకు అండ
  2. ఆయన దీవెనలతోనే ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్
  3. తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో నిర్మూలిస్తున్నాం: ప్రధాని మోదీ 
  4. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ‘అన్యాయంపై పోరాడి ధర్మాన్ని నిలబెట్టేందుకు సాక్షాత్తు శ్రీరాముడే ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేశాం. ముష్కర మూకపై ప్రతీకారం తీర్చుకున్నాం. తీవ్రవాదాన్ని (నక్సలిజాన్ని) కూకటివేళ్లతో సహా నిర్మూలిస్తున్నాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇది ప్రత్యేకమైన దీపావళి. ఇప్పుడు వారంతా మనశ్శాంతిగా పండుగ జరుపుకొంటారు. 

జీఎస్టీ సంస్కరణలతో ఇటీవల దేశానికి బచత్ ఉత్సవం తీసుకొచ్చాం. ఇదే స్ఫూర్తితో మనమంతా ‘వికసిత్ భారత్’ వైపు పయనిద్దాం’ అని దీపావళి పర్వదినం సందర్భంగా ప్రధాని మోదీ తాజాగా దేశప్రజలకు సందేశమిచ్చారు. ముందుగా పండుగ శుభాకంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ శుచీ శుభ్రత పాటించాలని, అరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. 

అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకున్న తర్వాత ఇది రెండో దీపావళి అని, పండుగ సందర్భంగా అయోధ్యాపురిలో అట్టహాసంగా వేడుకలు జరిగాయని కొనియాడారు. శ్రీరాముడి అండతోనే భారత్ అనేక విజయాలు సాధిస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు హింసను వీడి జన జీవన స్రవంతిలో కలిశారని, వారిని సాదరంగా స్వాగతించామని గుర్తుచేసుకున్నారు.

రాజ్యాంగంపై విశ్వాసంతో వారంతా ప్రజల మధ్యకు రావడం తాము సాధించిన గొప్ప విజయమని అభివర్ణించారు. ఈ చారిత్రక విజయాల మధ్య కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లను తగ్గించిందన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా బచత్ ఉత్సవం జరుగుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు వేలాది కోట్ల రూపాయలను ఆదా చేసుకుంటున్నారని తెలిపారు.

భారత్ త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని తెలిపారు. ఆత్మనిర్భర్ వైపు సాగే ఈ ప్రయాణంలో, పౌరులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వదేశీ మంత్రాన్ని అనుసరిస్తూ, స్వదేశీ వస్తువుల కొనుగోళ్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. 

‘విక్రాంత్’పై దీపావళి వేడుకలు

పనాజీ, అక్టోబర్ 21 : శత్రువు గుండెల్లో వణుకు పుంటించే విక్రాంత్ యుద్ధ నౌకపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. గోవా తీరంలోని విమాన వాహక నౌకపై టేకాఫ్‌లు చూస్తూ, దేశభక్తి గీతాలు వింటూ నావికాదళ సిబ్బందితో గడిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక అయిన ఈ విక్రాంత్‌ను మూడేళ్ల క్రితం ప్రధాని మోదీనే నౌకాదళంలో ప్రవేశపెట్టారు.

ఈ యుద్ధ నౌక విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశం ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ కావడం విశేషం. దీని కోసం భారత ప్రభుత్వం రూ.20 వేల కోట్లను ఖర్చు చేసింది. కొచ్చిన షిప్‌యార్డు లిమిటెడ్ సంస్థ నిర్మించిన విక్రాంత్‌ను 2022లో ప్రధాని మోదీ నేవీలోకి ప్రవేశపెట్టారు. దీంతో విమాన వాహక నౌకలు నిర్మించే సామర్థ్యం ఉన్న 6వ దేశంగా భారత నిలిచింది.