22-10-2025 02:09:03 AM
* అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా బెంగాల్‌లో ప్రారంభమైన ‘వసంత మేఘ గర్జన’ దాదాపు ఐదు దశాబ్దాలపాటు దండకారణ్యంలో ప్రతిధ్వనించింది. మధ్య భారతంలో సాళ వృక్షాల దట్టమైన అడవి.. రామాయణంతో ముడిపడివున్న అరణ్యం.. అక్కడక్కడ గిరిజన గూడేలు.. అన్యమానవులెవరూ అడుగుపెట్టలేని ప్రాంతం.. భారత మావోయిస్టు ఉద్యమానికి అది పెట్టని కోట.
భూస్వామ్యంపై తిరుగుబాటు బావుటా నెగరేస్తూ నక్సలైట్లు నిర్మించుకున్న సామ్రాజ్యం అది. పది రాష్ట్రాల్లో దాదాపు 125 జిల్లాల్లో విస్తరించిన ఈ సామ్రాజ్యం ఇప్పుడు కూలిపోయింది. నక్సలైట్ల ‘రెడ్ కారిడార్’ ఛిన్నాభిన్నమైంది. దండకారణ్యంలో ఇప్పుడు మువ్వన్నెల జెండాలు ఎగురు తున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భద్రతా దళాలు భారీగా మావోయిస్టులు లొంగిపోయేలా ముందుకు కదిలారు.
దీనిని, వామపక్ష తీవ్రవాదంపై ‘చారిత్రాత్మక విజయం’గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. లొంగిపోయి ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులకు క్షమాభిక్ష పెట్టడంతోపాటు వారికి ఉద్యోగాలు, వారి పిల్లలకు స్కూళ్లు ఇస్తామన్న వాగ్దానాలు హోరెత్తాయి.
లొంగిపోయిన నక్సల్స్‌కు రాజ్యాంగం పుస్తకాలు బహూకరించారు. దండకారణ్యంలో తుపాకుల మోత ఆగిన సందర్భం ఇది. ఇక కొత్త చరిత్రను దండకారణ్యం వీక్షించనుంది. భూమి, ఖనిజాలు.. ఇప్పటివరకు లోకం చూడని ట్రిలియన్ల సంపదను వెలికితీసే పని మొదలైంది..
దండకారణ్యం విముక్తమైంది అమ్మకానికుంది
పేదరికం, అసమానతల మధ్య కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ రైతాంగం, కూలీ లు.. భూస్వాములపై చేసిన ఉద్యమమే నక్సల్బరీ ఉద్యమం. 1967లో పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీలో మొదలైన సాయు ధ రైతాంగ పోరాటం దాదాపు దేశమంతటా విస్తరించింది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాం తాల్లో వేళ్లూనుకొంది. దట్టమైన అటవీ ప్రాంతాలకు మావోయిస్టు పార్టీ గెరిల్లాలు సంరక్షకులుగా నిలిచారు. అటవీ ప్రాంతా ల్లో ఎవరైనా మైనింగ్‌కు దిగితే, వారి మెషినరీని తగులబెట్టారు. జాతీయ రహదా రుల్లో రాకపోకలు సాగనివ్వలేదు.
వాణిజ్యపరంగా అడవులను దోచే ఏ పనులూ జరగకుండా ఒకరకంగా నిషేధం అమలుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా ప్రాంతాలకు బుల్డోజర్లు, డ్రిల్లింగ్ రిగ్గులు వెళ్లిన దాఖలాలు లేవు. పర్యావరణం అనే క ఏళ్లపాటు విలసిల్లి అనేక ప్రాణులకు ఈ అటవీప్రాంతాలు ఆలవాలమయ్యాయి. దేశంలో ఖనిజాలకు పుట్టగా వున్న దండకారణ్యం ప్రాంతాలను ఇన్నేళ్లు పరిరక్షిం చింది నక్సలైట్లేనని పర్యావరణ నిపుణులు చెప్పిన సందర్భాలున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో నిక్షిప్తంగా వున్న ఖనిజాల స్థాయి మామూ లు కాదు. దేశంలోని స్టీలు పరిశ్రమను దేదీప్యమానంగా వెలిగించగల ఇనుప ఖని జం నిల్వలు అక్కడ వున్నాయి. బైలదిల్లాలోని ఇనుప ఖనిజ నిల్వల గురించి ఎవరికీ తెలియంది కాదు. మధ్యప్రదేశ్‌లో ఇంతకాలం గుట్టుగా ఉన్న వజ్రాల క్షేత్రాలు దక్షిణాఫ్రికా వజ్రాల గనులకేమీ తక్కువ కాదు. జార్ఖండ్ రాష్ట్రంలోని బొగ్గు నిల్వల క్షేత్రాలు అసమాన్యం.
ఒడిషాలోని బాక్సైట్ కొండలు అంతులేని అల్యూమినియాన్ని ఇచ్చేవే. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాల్లోని అరుదైన, ఖరీదైన ఖనిజాలు ప్రపంచ సాంకేతిక రంగానికి పండగ తెచ్చేవే. ఇలా ‘రెడ్ కారిడార్’లో నిక్షిప్తమైన ఖనిజ సంపద విలువెంత? అనధికారికంగా 10 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఒక్క గడ్చిరోలి ఖనిజ సంపద చాలు, దేశ బడ్జెట్‌లను 25 ఏళ్లు నింపుతుందనేది మరో అంచనా.
ముప్పేట దాడులు..
ఆదివాసీ ప్రాంతాలను దోపిడీ నుంచి విముక్తం చేశామని మావోయిస్టు ఉద్య మం ప్రకటించుకున్నా, దండకారణ్యంలో క్రమంగా హింస రాజ్యమేలింది. గిరిజన గ్రామాల్లో ప్రజా కోర్టులదే శాసనమైంది. ఇటు భద్రతా బలగాలు, అటు నక్సలైట్ల మధ్య కాల్పుల్లో చాలాకాలం రక్తం పా రింది. గిరిజనులకు అభివృద్ధి అనే మాట ఆమడదూరంలోనే నిలిచింది. అడవులకు వెళ్లే రోడ్లు లేవు. వారికి ఆరోగ్య సదుపాయం అందని ద్రాక్షే అయ్యింది. వారి పిల్లలకు స్కూళ్లు లేక గిరిజనుల్లో అక్షరాస్యత అంతంతమాత్రంగానే వుంది. వారికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కరువయ్యాయి.
పిల్లల్ని కొరియర్లుగా అనుమానించే పరిస్థితి. దారికాచి జరుపుకొనే దాడులతో గిరి జన మహిళలు ఎందరో తమ భర్తల్ని కోల్పోయారు. వృద్ధులకు ఆహారం అందించేవారే కరువై ఆకలికి అలమటించారు. 2025 లెక్కల ప్రకారం, మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్లలో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2010 లెక్కల ప్రకారం, 10 వేల మంది మావోయిస్టులు ఉండగా ఇప్పుడు 500 మంది వరకు ఇంకా అడవుల్లో వుండవచ్చనని అంచనా. డ్రోన్లతో దాడులు, కమెండోల ఆపరేషన్లు, నగదు బహుమతులిచ్చి మా వోయిస్టుల ఆచూకీ తెలుసుకోవడం వంటి చర్యలతో భద్రతాదళాలు మావోయిస్టులపై ముప్పేట దాడులు చేశాయి.
ఎరుపు కాషాయంగా..
బీజేపీ ప్రభుత్వాలు కొన్నేళ్లుగా మావోయిస్టు ఉద్యమంపై ఉక్కు పిడికిలి మోపా యి. 2014 నుంచి ‘ఆపరేషన్ ప్రహార్’తో గ్రేహౌండ్ బలగాలు మావోయిస్టుల కమాండ్ వ్యవస్థ వెన్నువిరిచాయి. 2 బిలియన్ డాలర్లను ఉగ్రవాద వ్యతిరేక కార్యక లాపాలకు వెచ్చించారు. ఈ ఏడాది లొంగుబాట్లు 40% పెరిగాయి. వృత్తిపరంగా శిక్షణనిచ్చే సర్టిఫికెట్లు పొంది బస్తర్‌లో లొంగిపోయిన 45 ఏళ్ల మావోయిస్టు లక్ష్మణ్ హెమ్లా గతవారం విలేకరు లతో మాట్లాడాడు. ‘పేద ప్రజల కోసం మేం పోరాడతాం’ అని చెప్పిన హెమ్లా ఇప్పుడు తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు.
‘నా పిల్లలు ఇక ప్రాణభయంతో దాక్కోవద్దు.. వాళ్లు చదువుకోవాలని కోరుకుంటున్నా’నని హెమ్లా చెప్పారు. ‘రెడ్ కారిడార్’లో 90 మిలియన్ల జనాభా ఉంటుంది. వారిలో షెడ్యూల్ తెగలవారే ఎక్కువ. సుక్మాలో 5జీ టవర్లు వస్తున్నాయి. కోరాపుట్‌లో పాలిటెక్నిక్ కాలే జీలు ఏర్పాటుచేస్తున్నారు. బీజాపూర్ నెర్రెలుబారిన పంటపొలాల కోసం సాగునీటి కాల్వలు వేస్తున్నారు. గిరిజనుల ఆరోగ్యం కోసం హెల్త్ ఔట్‌పోస్టులు వెలుస్తున్నా యి.
యువకులు నాలు గు రాళ్లు సంపాదించుకునేందుకు స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు బీజేపీ ఇప్పటినుంచే పథక రచన చేస్తున్నది. ‘ఎరుపు కాషాయంగా మారుతున్నది మా రుమూల నుండే ప్రతి గ్రామానికి వికసిత భారత్ ఫలాలు అందుతాయి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అమితానందంతో ట్వీట్ చేశారు.
ఒక్కక్షణం.. దండకారణ్యంలో అభివృద్ధి మాటున నిజరూపాలు దర్శనమిస్తున్నా యి. మావోయిస్టు చెక్‌పాయింట్ల స్థానం లో సీఆర్‌పీఎస్ చెక్‌పోస్టులు వెలిశాయి. తలుపులు బార్లా తెరుచుకున్నాయి. బార్లా తెరుచుకున్న తలుపులు సమసమాజ స్థాపన కోసం కొత్త దారులు వెంట తీసుకొచ్చేవి కావు. వ్యాపారవర్గాల సామ్రాజ్యం అక్కడ నిర్మితం కానుంది. అదానీ, అంబానీల అండదండలతో గుజరాత్, మహా రాష్ట్ర రాష్ట్రాల నుంచి పరుగెత్తుకొస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఎకరాలకు ఎకరాల భూమిని సొంతం చేసుకొంటున్నాయి.
అక్కడ పెద్దగా పెట్టుబడి సొమ్ము కూడా అవసరంలేదు. గత నెల ముంబైకి చెందిన ఓ కన్సార్టియం, ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ‘ఎకోటూరిజం టౌన్‌షిప్స్’ నిర్మాణం కోసం 50 వేల హెక్టార్ల భూమి సేకరించింది. హైనాల వలె మైనింగ్ కంపెనీలు కాచుకొని వున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇనుప ఖనిజం తవ్వకాలకు వేదాంత బిడ్స్ వేసింది. జార్ఖండ్‌లో బొగ్గు వేలానికి జేఎస్‌డబ్ల్యూ ఉరకలు వేస్తున్నది. వజ్రాల వేటకు పన్నాపై డీ బీర్స్ కన్నేసి వుంచింది.
ఒకప్పుడు నక్సల్స్ ఆధీనంలో వున్న గడ్చిరోలిలోని సుర్మయి కొండలు ఇప్పుడు పెట్టుబడిదారులకు నునుపుగా కనిపిస్తున్నాయి. ‘ఆస్ట్రేలియాలోని పిల్‌బరా.. ఈ ప్రాంతం ముందు ఎందుకూ కొరకాదు’ అని ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ‘రియో టింటో’ అధికారి ఒకరు అననే అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పేరిట అడవుల్లోకి కొండచిలువలు పాక్కుంటూ వెళ తాయి.
ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తూర్పు దిశగా మళ్లుతోంది. అడవుల గుండా హైస్పీడ్ రైళ్లు వెళతాయి. జగదల్‌పూర్‌లో వ్యాపార సామ్రాజ్యాధినేతలు దిగేందుకు విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు దర్శనమిస్తాయి. జలవిద్యుత్ ఉత్పాదన పేరిట ఇంద్రావతి వంటి నదు లు ఛిద్రమవుతాయి. టేకు చెట్ల మీద సిమెంట్ ధూళి పేరుకుపోతుంది. 2030
కల్లా.. నీతీ ఆయోగ్ భవిష్య వాణి ప్రకారం, ఈ కారిడార్‌లో 500 బిలియన్ డాలర్ల జీడీపీ వర్ధిల్లుతుంది. ఉన్నవారికోసం విలాసవంతమైన హోటళ్లు, కొందరి కోసం అందినంత ఆర్జించి పెట్టే కర్మాగారాలు వెలుస్తాయి.
ఎలాన్ మస్క్‌ను తలదన్నేలా..
దోపిడీ మంత్రంతో, దేశంలో పాలకులను ఆశ్రయించే పెట్టుబడిదారులకు దండకారణ్యం పొట్టపగిలిపోయేటంత విందునివ్వనుంది. టెండర్లు పిలుస్తారు.. తూతూమంత్రంగా బయటికి పోటీపడినట్లు కనిపిస్తుంది. ‘విలువైన ఖనిజాలు’ ఎవరి చేతిలోకి వెళ్లాలో రాసిపెట్టినట్లు జరుగుతుంది. 2జీ కుంభకోణం, లేదంటే బొగ్గు స్కాం (కోల్ గేట్) గుర్తున్నాయిగా! బడా వ్యాపార సంస్థలు రిలయన్స్, టాటా, అదానీ వంటివాటి బ్యాలెన్స్ షీట్లు బెలూన్లలా ఉబ్బిపోతాయి. షేర్ల విలువ ఆకాశా న్నంటుతుంది. ఇండియన్ బిలియనీర్లు అప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను ఒక్క తోపు తోసేస్తారు.
అంతేనా.. దుబాయిలో షెల్ కంపెనీలు పుడతాయి. సింగపూర్‌లో మన సొమ్ము పెరుగుతుంది. స్విస్ బ్యాంకుల్లో మన హవాలా సొమ్ము భద్రంగా పారుతుంటుంది. పనామా పేపర్లు ఇప్పటికే బ్లాక్‌మనీ గుట్టు విప్పాయి. ఇప్పుడు ట్రిలియన్ల కొద్దీ డబ్బు ఆ చీకటి సామ్రాజ్యానికి వెళుతుంది. ఇక్కడో 10%, అక్కడో 30% ముడుపులతో కొందరు నాయకులు, ఆఫీసుల్లో కాలుమీద కాలేసుకొని కూర్చునే బాబులు చక్కగా జేబులు నింపుకొనే బంధాన్ని కొనసాగిస్తుంటారు. ప్రతిపక్ష ఎంపీలు, విజిలెన్స్ కమిషన్లు, చేతులు మెలిపెట్టినట్లు ఉండే మీడియా భయంతోనో, భక్తితోనో ప్రేక్షక పాత్ర వహిస్తుంటాయి.
బ్రిటిష్ పాలకులు బెంగాల్ నేత మిల్లులను, బీహార్‌లోని గనులను దోచుకు పోయారు. కోల్‌కతా వెండితో లండన్ వీధులు మెరిశాయి. ఆగ్రాలో తాజ్‌మహల్ నిర్మాణం కోసం మొగలులు ఆలయాల్లోని విగ్రహాలను కరిగించారు. ఇప్పుడు మన కంటిని మననే పొడుచుకుంటున్నాం. దండకారణ్య వజ్రాలు రేపు దుబాయ్ టవర్ల మీద దర్శనమివ్వవచ్చు. సింగపూర్ ఆకాశహర్మ్యాల మీద బాక్సైట్ కనిపించవచ్చు.
ఈడీ, సీబీఐ, పర్యావరణ సంస్థలు చేతులు కట్టుకొని నిలబడాల్సి రావచ్చు. భరతమాత ఇంట్లో ఆమె సంతానమే లూటీ చేస్తుంది. ప్రకృతి ఊరుకోదు కదా.. అడవులు కూరిపోతుంటే వచ్చేవన్నీ ఉత్పాతాలే. వాతావరణ మార్పులకు ఎవరు తట్టుకోగలరు? అరుదైన ఖనిజాల కోసం తవ్వితే పుల్‌జహారీ నది విషతుల్యమైంది. అదేపనిగా బొగ్గు కోసం భూమిని కుల్లబొడిస్తే ఆమ్ల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిరక్షణకు అంతర్జాతీయ వేదికలపై ఎన్ని ఒప్పందాలు చేసుకుంటే ఏం లాభం?
సాళ వృక్షాల నీడల్లో మినుగురు పురుగులు కాంతులు చిమ్ముతూ ఆశలు మినుకుమినుకుమంటున్నాయనే సంకేతాన్ని ఇస్తున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటి కైనా సరైన దిశలో పయనించాలి. గనులకు ఈ నిర్వహించి పారదర్శకత పాటించాలి. ప్రాజెక్టు టైగర్ 2.0 కింద 60 శాతం అటవీ ప్రాంతానికి గెజిట్ ఇవ్వాలి. ఆదివాసీ సహకార సంఘాలకు నిర్దిష్ట భూములను కేటాయించి, రాయల్టీ ఇవ్వా లి. ఇనుప ఖనిజం లేవీతో స్కూళ్లు ఏర్పాటుచేయాలి. బొగ్గు సెస్‌తో ఆస్పత్రులు నిర్మించాలి. ప్రభుత్వ సంస్థల్లో గిరిజనులకు అదనపు కోటా ఇవ్వాలి. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో గిరిజన గ్రామాల మాట చెల్లుబాటు కావాలి.
ఇది మా మాతృభూమి..
తుపాకీ గొట్టం ద్వారా రాజ్యా ధికారం సాధిద్దామని యువత నడుంకట్టకపోవచ్చు. కానీ వారి చేతి లో యాప్‌లున్నాయ్.. అనేక మార్గాలున్నాయ్. అడవుల్ని వారే చేతుల డ్డుపెట్టి కాపాడుకుంటారు. దోపిడీని అడ్డుకుంటారు. దండకారణ్యం సూర్యాస్తమయమే కాదు.. సూర్యోద యాన్ని కూడా చూస్తుంది. అక్కడ మావోయిస్టు గెరిల్లాలు లేకపోయి నా ఇది మా భరతభూమి.. మా మాతృభూమి అని నినదించేవాళ్లకు కొదువలేదు.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి