calender_icon.png 30 September, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు

30-09-2025 12:07:37 AM

పటాన్ చెరు, సెప్టెంబర్ 29 : సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్ చెరులో అంబరాన్ని అంటాయి. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై సోమవారం సా యంత్రం ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో వేలాదిమంది మహిళలు తమ బతుకమ్మలతో హాజరయ్యారు. ప్రముఖ జానపద, సంగీత గాయకుల ఆధ్వర్యం లోని బృంద సభ్యులు ఆలపించిన బతుకమ్మ గీతాలకు అనుగుణంగా మహిళలు బతుకమ్మ ఆడారు.

బిత్తిరి సత్తి హాస్యం అందరినీ అలరించింది. సాయంత్రం ప్రారంభమైన సంబరాలు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రకృతిని ప్రేమి స్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు నగదు బహుమతులు అందజేశారు.

ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను విజేతలకు అందించారు. 10 మంది మహిళలకు పట్టు చీరలు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, కుమార్తె, కోడలు, మనుమరాళ్లు,మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిఐలు వినాయక రెడ్డి, లాలూ నాయక్ లు బందోబస్తును ఏర్పాటు చేశారు. 

* సద్దుల బతుకమ్మ అలంకరించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 

శివంపేట, సెప్టెంబర్ 29 : శివంపేట మండలంలో వివిధ గ్రామాలలో సోమవారం ఘనంగా బతుకమ్మ వే డుకలు జరిగాయి. అందులో భాగంగా శివంపేట గ్రా మంలో సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పం డుగను భక్తి భావంతో జరుపుకుంటూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను జరుపుకోవడం సం తోషంగా ఉందని ఆడపడుచులు అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శివ్వంపేట మండలంలోని స్వగ్రామమైన గోమారంలో బతుకమ్మను అలంకరించారు.

ప్రతీ సంవత్సరంలాగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే  తన కుటుంబ సభ్యులందరితో కలిసి తీరొక్క పువ్వులతో బతుకమ్మను అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను భక్తి భావంతో జరుపుకుంటూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని అన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. నియోజకవర్గ,మండల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

శాస్త్రీయమైనది బతుకమ్మ పండుగ 

సిద్దిపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ  గ్రామంలోని శ్రీ విజయ దుర్గా సమెత శ్రీ సంతాన మల్లి ఖార్జున దేవాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన దుర్గామాతలను దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం జరిగిన బతుకమ్మ సంబరాలలో ఆయన సతీమణి శ్రీనీతతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని కైవసం చేస్తుందన్నారు. ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో, తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ పండుగలు విశ్వవిఖ్యాతమయ్యాయనీ చెప్పారు. తెలంగాణ వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా చాలా గొప్పగా జరుపుకుంటున్నారనీ తెలిపారు. బతుకమ్మ పండగ శాస్త్రీయమైనదని అందుకే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందన్నారు.

 బాలసదనంలో  

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 29 : సంగారెడ్డిలోని బాలసదనంలో మహిళా శిశు  సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆడపిల్లలకు బతుకమ్మ సంబరాలు చేయడం జరిగింది. ఈ బతకమ్మ సంబరాలలో భాగంగా జిల్లా మహిళా సంక్షేమ అధికారిని లలిత  కుమారి, డీసీపీవో  రత్నం, సూపరింటెండెంట్  విజయకుమారి, రజిత, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్, హేమంత్, ఎఫ్‌ఆర్‌ఓ సతీష్,  సిబ్బంది పాల్గొనగా. పిల్లలందరూ కూడా ఆటపాటలతో నృత్యం చేశారు.

నార్సింగిలో

నార్సింగి/ చేగుంట, సెప్టెంబర్ 29 : నార్సింగి మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు ఆకట్టుకున్నాయి, ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై  సద్దుల బతుకమ్మ తో ముగిసాయి. దసరా నవరాత్రులను పురస్కరించుకుని జరిగే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్స వాలు సోమవారం సద్దుల బతుకమ్మ తో ముగియగా, మండల వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఆయా గ్రామాలలో ఘనంగా నిర్వహించారు.

నార్సింగి పట్టణ కేంద్రం లో నిర్వహించిన కార్యక్రమంలో ఆనవాయితీ ప్రకారం బతుకమ్మలను, డప్పు చప్పుళ్ళతో బతుకమ్మలను ఎదుర్కోలు పలుకుతూ ఇళ్ల నుండి తెచ్చి, అంగడి ప్రధాన వీధి లోని మధ్య రంగం వద్ద ఉంచారు. బతుకమ్మ పాటలు డీజే లో మోగుతుండగా మహిళలు భక్తితో  మైమరచిపోయి బతుకమ్మ ఆడారు.

అనంతరం మహిళలు ఆయా గ్రామాల చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ యెన్నం రాజేందర్, మాజీ యూత్ అధ్యక్షుడు బాచి స్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అంచనూరి రాజేష్ వేడుకలను వీక్షించారు. 

మునిపల్లిలో

మునిపల్లి, సెప్టెంబర్ 29 : మండల కేంద్రమైన మునిపల్లితో పాటు ఆయా గ్రామాల్లో బతుకమ్మ పండుగ వేడుకలు సోమవారం నాడు ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా రెండు రోజుల నుంచి గునుగు పువ్వుతో పాటు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి రంగురంగులతో మహిళలు తయారు చేశారు. ఇందులో భాగంగా సోమవారం గ్రామాల పురవీధుల గుండా డప్పుచప్పుళ్ల మద్య బతుకమ్మలను ఊరేగింపుగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. 

ముప్పిరెడ్డిపల్లిలో 

మనోహరాబాద్, సెప్టెంబర్ 29 : బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిప ల్లి లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మను మహిళలు ఇంట్లో తయారుచేసి గౌరమ్మగా మలిచి గంగమ్మ గుడి లోకి పంపుటకు సిద్ధం చేయడం జరిగింది. మహిళలు హనుమాన్ దేవాలయం వద్ద బతుకమ్మలు ఒకచోట పేర్చి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడారు. ఇందులో తాజా మాజీ సర్పంచ్ నరాల ప్రభావతి పెంటయ్య, మాజీ సర్పంచి సంజీవ గ్రామ పెద్దలు, మహిళలు ఈ బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేశారు. 

గజ్వేల్‌లో

- గజ్వేల్/ జగదేవపూర్/ కొమురవెల్లి/ చేర్యాల/ కొండపాక/ దౌల్తాబాద్/ బెజ్జంకి/ సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 29: తొమ్మిది రోజులుగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకొని సోమవారం సంబరంగా సద్దుల బతుకమ్మ నిమజ్జన వేడుకలు ముగిశాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గ కేంద్రాలలో జరిగిన బతుకమ్మ సంబరాలలో ఎమ్మెల్యేలు వారి సతీమణులు బతుకమ్మ సంబరాలలో ఆడి పాడారు పలు గ్రామాలలో ప్రభుత్వ అధికారులు బతుకమ్మ వేడుకలలో పాల్గొని సందడి చేశారు. పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట పెట్టి పాటలతో మహిళలు ఆడారు. మరికొన్నిచోట్ల డీజే సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేసి బతుకమ్మ పాటలు పెట్టుకొని డాన్సులు చేశారు.