calender_icon.png 25 September, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బతుకమ్మకుంటలో బతుకమ్మ సంబురాలు

25-09-2025 01:07:44 AM

  1. హాజరుకానున్న ముఖ్యమంత్రి
  2. 29న సరూర్‌నగర్‌లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఉత్సవం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సరూర్‌నగర్ స్టేడియంలో ఈనెల 29న నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతో పాటు, 26న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. 29న నిర్వహించే కార్యక్రమం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్‌లో నమోదయ్యే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు.

రాష్ర్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అంబర్‌పేట్‌లో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మ కుంటలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు సీఎం 26న పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో హాజరవుతున్నందున తగు ఏర్పాట్లను చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులను ఆదేశించారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ప్రజాప్రతినిధులు, వీఐపీలకు సకాలంలో పంపించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశించారు.