20-09-2025 08:18:14 PM
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్, శివ వీధిలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలల్లో బతుకమ్మ వైభవ్ ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను చాలా గొప్ప వేడుకగా ఆనందోత్సవాల మధ్య కోలాహాలంతో నిర్వహించుకుంటారన్నారు.
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని, తెలంగాణ సంస్కృతిని పరిరక్షించిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా అభివర్ణించబడిన ఈ బతుకమ్మ పండుగ మహిళలకు చాలా ప్రత్యేకమైనదన్నారు. పురాణాలలో ఇతిహాసాలలో బతుకమ్మకు చాలా విశిష్టత ఉందని, ఈ విశిష్టతను పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు. అంతకు ముందు పాఠశాల ప్రాంగణంలో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.