20-09-2025 09:19:41 PM
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైన ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు శనివారం పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పసుపు కుంకుమలతో భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజించి, ఆటపాటలతో బతుకమ్మను కొలిచారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు, విద్యార్థులు అందరూ బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మ పాటలకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రపంచంలోనే పువ్వుల పేరుతో పండుగ నిర్వహించుకునే ఏకైక పండుగ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అని తెలిపారు. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేందుకే బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. పండుగ సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు వైద్య శ్రీనివాస చారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి, మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు.