17-10-2025 08:51:42 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ హాల్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో వివిధ రాజకీయ పార్టీల బీసీ సంఘాల నాయకులు పాల్గొని రేపటి బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్ మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసమే కాదు, బీసీల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమం చేస్తున్నాం. బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా సమానత సాధ్యం కాదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకపోవడం సామాజిక న్యాయానికి విరుద్ధం,” అన్నారు. బీసీ నేత రామా గౌడ్ మాట్లాడుతూ... “ప్రభుత్వానికి మద్దతిస్తూనే మా న్యాయమైన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం. బీసీలను అన్ని రంగాల్లో పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా హక్కులు సాధించే వరకు వెనక్కు తగ్గం,” అని తెలిపారు.మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ, “బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఉద్యమాన్ని ముమ్మరం చేయాలి.
EWSలకు 10% ఇచ్చినప్పుడు 56% ఉన్న మాకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ, “56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తాం,” అని తెలిపారు. బీజేపీ నాయకుడు కోలా ఆంజనేయులు మాట్లాడుతూ, “పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ నాయకుడు ఐక్యంగా పోరాడినప్పుడే లక్ష్యం సాధ్యం అవుతుంది. రేపటి బంద్‌కు వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం,” అన్నారు.