17-10-2025 08:46:58 PM
భయాందోళనలో ప్రజలు
మరమ్మత్తులకు చర్యలు శూన్యం
కొత్త వాటర్ ట్యాంకులకు మంజూరు కానీ నిధులు
బాన్సువాడ,(విజయక్రాంతి): పట్టణాలకు, పల్లె ప్రజలకు తాగునీటిని అందించే వాటర్ ట్యాంకులు ప్రమాదపు అంచున చేరాయి. రక్షక మంచినీటి పథకాలు శిథిలావస్థ దశకు చేరుకోవడంతో అవి ఎక్కడ కూలిపోతాయి అన్న భయం ఆ ప్రాంతవాసులను బీతిల్లెలా చేస్తుంది. 50 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకోవడంతో కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటికి మరమ్మత్తులు చేద్దామన్న ధ్యాస ఇటు మునిసిపాలిటీ పాలకులకు గానీ, అధికారులకు గాని లేకుండా పోయింది. పలుమార్లు ప్రజలు, ఆయా పార్టీల నాయకులు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ చర్యలు శూన్యంగానే మిగిలిపోయాయి.
రోజురోజుకు వాటర్ ట్యాంకుల పరిస్థితి పగుళ్లు తీస్తూ కనిపిస్తుండడంతో ఎప్పుడు కూలుతాయోనన్న దిగులు ఆ ప్రాంత వాసులను కలవరో పెడుతుంది. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 30 ఏళ్లుగా ఆ కాలనీ వాసులకు నీరందిస్తున్న బ్యాంకుకు కనీసం మరమ్మత్తు చేయాలన్న సోయి అధికారులకు కానీ పాలకుల కాని లేకుండా పోయింది. వాసులు ఫిర్యాదులు చేసినప్పటికీ బుట్ట దాఖలయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి రక్షత మంచినీటి పథకాన్ని తొలగించి కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టాలంటే ఆందోళన చేశారు.
వాటర్ ట్యాంక్ ప్రమాదకరంగా మారిందని, కూలిపోయే దశకు చేరుకున్న ఆయన ఆరోపించారు. పూర్తిగా శిథిలమైన ట్యాంకును తొలగించి ఆ ప్రాంతంలోనే కొత్త వాటర్ ట్యాంకును నిర్మించాలని డిమాండ్ చేశారు. మరోమారు వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఈ విషయంలో పట్టించుకోకపోవడం సమంజసం కాదని ఆయన వాపోయారు. ఇదిలా ఉండగా, నసురుల్లాబాద్ మండలం అంకుల్ గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం కూడా దీనావస్థకు చేరుకుంది. 50 ఏళ్ల క్రితం నిర్మించిన అట్టి వాటర్ ట్యాంకు మరమ్మత్తులు చేయలేకపోవడం వల్ల అది పూర్తిగా శిథిలా వస్త దశకు చేరుకుంది. కొత్త వాటర్ ట్యాంకు నిర్మించాలంటూ స్థానిక బిజెపి నాయకులు, నసురుల్లాబాద్ మండల బిజెపి అధ్యక్షుడు చందూర్ హనుమాన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
రక్షిత మంచినీటి పథకం ముందు నిలబడి తమ నిరసనను వ్యక్తపరిచారు. వెంటనే అధికారులు పాలకులు స్పందించి కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం విధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంక్ ఇప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని హనుమన్లు పేర్కొన్నారు. కాగా అసుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో అదే పరిస్థితి నెలకొంది. 50 ఏళ్ల క్రితం నిర్మించిన రక్షిత మంచినీటి పథకం పూర్తి శిథిలావస్థ దశకు చేరుకొని కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. భారీ వర్షాలు పడితే వాటర్ ట్యాంక్ కూలి సమీప ప్రాంతవాసులకి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. శిథిలావస్థ శిథిలమైన వాటర్ ట్యాంకులు తొలగించి కొత్త ట్యాంకును నిర్మించేందుకు అటు పంచాయతీ పాలకులు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం కృషి చేయాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రజలకు దాహార్తిని తీర్చే మంచినీటి పథకాలు రక్షించేవిగా ఉండాలి కానీ.. భక్షించే విధంగా తయారవుతున్న వాటి మరమ్మతుల కోసం కనీస చర్యలు చేపట్టే ఆలోచన పాలకులకు లేకపోవడం విడ్డూరకరం. ఈ సమస్యను అధికారులు శాసనసభ్యులు దృష్టికి తీసుకోకపోవడం శోచనీయం. కాలక్షేపం కోసం కార్యాలయాలకు రావడం, వచ్చామా.. పోయామా.. అనిపించుకోవడం తప్ప మున్సిపల్ అధికారులకు గాని, గ్రామపంచాయతీ అధికారులకు గాని లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రక్షిత మంచినీటి పథకాల మరమ్మతులు, కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం కోసం చర్యలు చేపట్టాలని పల్లె పట్టణ వాసులు కోరుతున్నారు.