05-09-2025 01:43:51 AM
-42 శాతం రిజర్వేషన్ కోసం పోరాడాలి
-దసరా తర్వాత భువనగిరిలో లక్ష మందితో బీసీ సింహ గర్జన సభ
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు సాధించటానికి పార్టీలకు అతీతంగా బీసీలంతా ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. దసరా తర్వాత భువనగిరిలో లక్ష మందితో బీసీ సింహ గర్జన సభను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సభకు బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టంతో పాటు ఆర్డినెన్స్ కూడా చేయటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆపటం రాజ్యంగ విరుద్ధమన్నారు. రాజకీయ పార్టీలది గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాటగా ఉందని, నెల రోజులు పార్లమెంటు సమావేశాలు జరిగితే రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడకపోవడం విచారకరమన్నారు. బీజేపీ గతంలోనే బీసీల రిజర్వేషన్ అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టిందని, కానీ ఢిల్లీలో మాత్రం వ్యతిరేకిస్తుందని విమర్శించారు.
ఒక్క శాతం ఉన్న బ్రాహ్మణులు 45 మంది కేంద్ర క్యాబినెట్‌లో ఉన్నారని, 60 శాతం ఉన్న బీసీలు కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ తాను బీసీ అని చెప్పుకుంటాడేగానీ గత 12 సంవత్సరాల నుంచి ఆయన బీసీలకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఓసీలకు మాత్రం రిజర్వేషన్ కల్పించాడని చెప్పారు. మోదీకి ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు గుర్తొస్తారని విమర్శించారు.
రాష్ట్రంలో, దేశంలో బీసీలు 60 శాతం మంది ఉన్నారని, అయినా తాము 42 శాతం రిజర్వేషన్ అడుగుతున్నామని, 60 శాతం అడగట్లేదని తెలిపారు. తెలంగాణలో రెడ్లు, వెలుమలు వీరిద్దరే పాలకులుగా ఉంటారని, అదేవిధంగా కేంద్రంలో కూడా అగ్రవర్ణాలే పాలకులుగా ఉంటారని, ఓట్లు మావి సీట్లు మీకా అని ఆయన ప్రశ్నించాడు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టం చేసే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఈ సమావేశంలో బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, జిల్లా అధ్యక్షుడు కొత్త నర్సింహ స్వామి, మాటూరి ఆశోక్, నర్సింహ చారి, వరికుప్పల మదు, బాబురావు, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.