10-07-2025 06:32:27 PM
కలెక్టర్ కు మంత్రి జూపల్లి ఫోన్ ద్వారా ఆదేశం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ & ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ మేరకు మంత్రి జూపల్లి.. కలెక్టర్ వెంకటేష్ దోత్రే తో ఫోన్ లో మాట్లాడారు.
జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాణహిత నది ఉదృతంగా ప్రవహిస్తుంది. కుమ్రం భీం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేశారు, ఇదే సమయంలో వర్ష ప్రభావం వల్ల ప్రభావిత ప్రాంతాలు, ప్రత్యేకించి బెజ్జూరు, పెంచికల్ పేట్, దహేగాం మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్.. మంత్రికి వివరించారు.