20-08-2025 12:50:39 AM
- కడెం ప్రాజెక్టును పరిశీలించిన ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
- రూ.9 కోట్ల నిధులతో మరమ్మతు పనులు పూర్తిచేశాం
-గల్లంతైన మృతదేహం లభ్యం
ఖానాపూర్, ఆగస్టు (విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టును ఉమ్మడి జిల్లా ఇంచార్జి మం త్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోపై ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షా లు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఇప్పటికే 9 కోట్ల రూపాయల నిధులతో మరమ్మతు పనులు పూర్తిచేశామని వెల్లడించారు.
వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, రవాణా సౌకర్యాన్ని మెరుగుపర చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ వరదల కారణంగా పంట పొలాలు, నివాస గృహాలు, రహదారులు నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన అనంతరం సంబంధిత శాఖలు సర్వే చేసి, నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక పంపుతాయని, అనంతరం బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
వరద నీటిలో కొట్టుకుపోయిన ఒక మత్స్యకారుని కోసం గాలింపు చర్యలు జరుగుతున్నా యని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధా ల ఆదుకుంటుందని మంత్రి అన్నారు. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపడతామని వెల్లడించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు సమాచారం అందించాలని, అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వాగులు, నదులు, ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.ఈ కార్యక్ర మంలో కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్సీ దండే విట్టల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్‌పై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటన
ఆదిలాబాద్, ఆగస్టు 19 ( విజయ క్రాంతి ) : భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలలకు కారు వెళ్లలేని తరుణంలో ప్రత్యామ్నాయంగా బైక్ పై ప్రయాణం చేస్తూ నష్టపోయిన పంటలను పరిశీలించారు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. గత నాలుగు రోజులుగా జిల్లాలు కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.
ఇందులో భాగంగానే భీంపూర్ మండలంలో ఎమ్మెల్యే బైకుపై సుడిగాలి పర్యటన చేశారు. మహారాష్ట్ర అనుకోని ఉన్న కరంజి, గోముత్రి, అంతర్గావ్, అర్లి, వడూర్, గుబిడి, ధనోర, భీంపూర్, కరణ్ వాడి గ్రామాల్లోని పెన్ గంగా నది ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడవద్దని తాము అండగా ఉంటామని వారికి ధైర్యం కల్పించారు. నష్టపోయిన ప్రతీ రైతుకు నష్టపరిహా రం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు. పంట నష్టం పై రానున్న అసెంబ్లీ సమావేశలో పార్టీ తరఫున గట్టిగా తమ వాణి ని వినిపిస్తామన్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి వచ్చేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కేసీఆర్ దృష్టికి నష్టం వివరాలు తోసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
గల్లంతైన మృతదేహం లభ్యం
కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేట్లు ఇరగడంతో కడెం నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన కన్నాపూర్‌కు చెందిన గంగాధర్ వరద నీటిలో గల్లంతు కాగా మృతదేహం బుధవారం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసు అగ్నిమాపక సిబ్బంది ఎన్డిఆర్‌ఎఫ్ సభ్యులు నది పరివక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా వృద్ధ దేహం కనిపించడంతో బయటకు తీసి కుటుం బ సభ్యులకు అప్పగించారు.
వరద బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఏలేటి
నిర్మల్, ఆగస్టు ౧౯ (విజయక్రాంతి): సారంగాపూర్ మండలం జాం గ్రామ సమీపంలో గల కల్వర్టు ను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాల వల్ల కల్వర్టులు వరద నీటి ఉధృతికి దెబ్బతిన్నాయని, తిరిగి త్వరితగతిన వాటికి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంత రం మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో - ఔట్ ఫ్లో సంబంధిత వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్ తో పాటు జిల్లా, మండల ,పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు, రైతులు పాల్గొన్నారు.