25-05-2025 12:18:33 AM
-తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ విద్యకు భారీ డిమాండ్
-వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు
-అనుమతులు లేని కళాశాలల్లో చేరి మోసపోవద్దంటున్న నిపుణులు
-ఎన్‌ఎంసీ నిబంధనలను పాటించే కాలేజీల్లో చదివితేనే గుర్తింపు
-వైద్యవిద్యపై మోజుతో ఏమరుపాటుగా ఉంటే అంతేసంగతులు
హైదరాబాద్, మే 2౪ (విజయక్రాంతి): దేశంలో వైద్యవిద్యకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. వైద్యులకు సమాజంలో ఉన్న హోదా, ఆకర్షణీయమైన సంపాదన, జీవి తం చాలా మంది విద్యార్థులను ఎంబీబీఎస్ వైపు ఆకర్షిస్తోంది.
ఈ ట్రెండ్ తెలుగు రాష్ట్రా ల్లో మరింతగా ఉంది. ఏటా దేశవ్యాప్తంగా సుమారు 23లక్షల మంది నీట్ ప్రవేశ పరీక్షకు హాజరైతే అందులో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.50లక్షల మంది విద్యార్థులు వైద్యవిద్య కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
అయితే దేశంలోని 848 మెడికల్ కాలేజీల్లో 1,18,148 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి.ఇందులో తెలంగాణలో 65 మెడికల్ కాలేజీల్లో 9,065 సీట్లు, ఏపీలో 38 కాలేజీల్లో 6,785 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లకోసం భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాగైన వైద్యవిద్య చదవాల్సిందేనని విద్యార్థులు, వారి తల్లితండ్రులు విదేశీబాట పడుతున్నారు.
ఈ క్రమంలో ఎంబీబీఎస్ కోర్సుపై ఉన్న మోజు ను దృష్టిలో పెట్టుకుని కొందరు అక్రమార్కు లు కన్సల్టెన్సీల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. సీట్లు ఇప్పిస్తామంటూ లక్షల్లో ఫీజులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. మరికొందరు అనుమతి లేని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ మెడికల్ కమిషన్ విద్యార్థులు, వారి తల్లితండ్రులకు సూచిస్తోంది.
ఎంబీబీఎస్ కోసం విదేశాలకు వెళ్లేవారికి జాగ్రత్తలు..
దేశంలో అనుమతులు లేకుండా నడుస్తున్న మెడికల్ కాలేజీలతోపాటు విదేశాల్లో అనుమతి లేని మెడికల్ కోర్సులపై విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండా లని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) హెచ్చరించింది. వైద్య విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థలకు కీలక సూచనలు చేసింది.
విదేశాల్లో మెడికల్ విద్య అభ్యసించదలచిన విద్యార్థులు కోర్సు వ్యవధి, ఇంటర్న్‌షిప్ తదితర కీలక అంశాలను గమనించాలని సూచనలు చేస్తూ అడ్వుజరీ విడుదల చేసింది. ఆయా దేశాల్లో వైద్యవిద్యను అందించే కాలేజీల ప్రత్యేకతలను గమనించిన తర్వాతే చేరాలని నిపుణులు సూచిస్తున్నారు. పేరుకే ఎంబీబీఎస్ అంటే ఆ చదువు వల్ల సార్థకత కూడా ఉండబోదని చెబుతున్నారు.
విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేవారికి ఎన్‌ఎంసీ సూచనలు..
-విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు కచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సియేట్ (ఎఫ్‌ఎంజీఎల్) నిబంధనలను పాటించాలి.
-కోర్సు వ్యవధి కచ్చితంగా 54 నెలలు (4.5 సంవత్సరాలు) ఉండే కాలేజీలోనే చదవాలి.
-అదనంగా అదే సంస్థలో 12 నెలలు ఇంటర్న్‌షిప్ చేయాలి.
-పాఠ్యాంశాలు ఎన్‌ఎంసీ నిబంధనల మేరకే ఉండాలి.
-ఎంబీబీఎస్ విద్య పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోనే చదవాలి.
-ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఎక్కడైతే ఎంబీబీఎస్ చేస్తారో అదే కాలేజీలో క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
-విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక కచ్చితంగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (ఎన్‌ఈఎక్స్‌టీ) పాసవ్వాలి.
-ఎన్‌ఈఎక్స్‌టీ పాస్ అయ్యాక మన దేశంలో ఏడాది పాటు హౌస్ సర్జన్‌గా పనిచేయాలి. అప్పుడే దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు, ఉద్యోగం చేసేందుకు అనుమతి ఉంటుంది.
అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు
ఎంబీబీఎస్ విద్యకు ఉన్న ఆదరణ దృష్ట్యా చాలామంది మన దేశంలో అవకాశాలు లభించక విదేశాలకు వెళ్తారు. అయితే ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలి. నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్‌సైట్‌లో విదేశీ విద్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది.
చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో వైద్యవిద్య కోసం వెళ్లే విద్యార్థులు కచ్చితంగా ఆ కాలేజీ లేదా యూ నివర్సిటీకి అనుమతి ఉందా లేదా ఎన్‌ఎంసీ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలా గే వైద్యవిద్యకు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకునేందుకుగాను ఎన్‌ఎంసీ టోల్‌ఫ్రీ నెంబర్ 91 ఫోన్ చేయవచ్చు. విదేశీ మె డికల్ కాలేజీల నుంచి వచ్చే ఆఫర్ లెటర్లను చూసి మోసపోకుండా ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో చెక్ చేసి నిర్ధారించుకుని చేరాలి. ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి మోసపోవద్దు.
శ్రీనివాస్, వైస్ చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్