27-01-2026 12:00:00 AM
ప్రజాస్వామ్యం అనేది ఎన్నికల రో జుకు మాత్రమే చెందిన వ్యవస్థనో పాలనా విధానమో కాదు. ఇది ప్రజ ల ప్రాథమిక హక్కు, గౌరవం, స్వేచ్ఛ. ప్ర జల ఆత్మగౌరవానికి ప్రతిరూపం. ప్రజల చేతుల్లో అధికారం అన్న భావనతో పుట్టిన ప్రజాస్వామ్యం నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. జెండాలు ఎగురుతున్నాయి. కానీ ప్రజల గొంతు మాత్రం మౌనమవుతోంది. ఓటు వేసే హ క్కు ఉన్నా ప్రశ్నించే స్వేచ్ఛ క్రమంగా కరిగిపోతోంది. ఇది ఒక్క దేశానికే పరిమితమైన సమస్య కాదు. గ్లోబల్ డెమోక్రసీకి పట్టిన జబ్బు.
ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లకోసారి ఓటు వేసే ప్రజలు మౌనంగా ఉండాలి. ప్రశ్నించకూడదు. నిరసించకూడదు అన్న అప్రకటిత నియమం అమలవుతున్నది. ఎ న్నికలు జరిగితే చాలు ప్రజాస్వామ్యం బతికినట్టే అన్న భ్రమను అధికార వ్యవస్థలు కల్పించాయి. ప్రజలు ఓటు ద్వారా అధికారాన్ని అప్పగిస్తున్నారు. ఆ అధికారం తిరిగి ప్రజల కోసం పనిచేయడం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నా ఆ తరువాత పాలన ప్రశ్నించలేనిదిగా మారుతోంది.
కార్పొరేట్ల పెత్తనం
ప్రజాస్వామ్య సంక్షోభానికి మరో ప్రధా న కారణం ఆర్థిక అసమానతలు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంటే రాజకీయ శక్తి కూడా వారి చేతుల్లోకి వెళ్తోంది. కార్పొరేట్ నిధులు రాజకీయాలను నియంత్రిస్తున్నాయి. విధానాలు ప్రజల కోసంకాదు లాభాల కోసం రూపొందుతున్నాయి. పేదల ఓటు ఎన్నికల రోజు అవసరం. ధనికుల డబ్బు పాల నంతా అవసరం అని పాలకులు భావిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. పేదల ఓటుతో కుర్చీ ఎక్కి ధనికుల ఆజ్ఞలతో పాలించే కార్పొరేట్ సామ్రాజ్యం. నిరసన హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం.
ఆ ప్రాణమే నొక్కబడుతోంది. శాంతియుత నిరసనలు కూడా నేరాలుగా మలుస్తున్నా రు. రోడ్లపైకి వస్తే లాఠీలు, జైళ్లు, కేసులు. ప్రజలు భయపడాలి అన్నదే పాలకుల వ్యూహం. భయంతో నడిచే వ్యవస్థ ప్రజాస్వామ్యం కాదు. 21వ శతాబ్దంలో సాంకేతి కత, విద్య, సమాచార విప్లవం ప్రజలను శక్తిమంతులను చేయడం ద్వారా ప్రజాస్వా మ్యం బలపడుతుందనుకుంటే జరిగినది వేరు. ప్రజాస్వామ్యం బలపడలేక నియంత్రణకు లోనైంది. ప్రభుత్వాలు ప్రజల కో సం కాకుండా ప్రజల మీద పాలించే యం త్రాలుగా మారాయి.
భావప్రకటనా స్వేచ్ఛహరణం
యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఇండియా ఎక్కడ చూసినా ఒకే దృశ్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కూల్చే అత్యంత సులభమైన ఆయుధం ప్రజల భద్రత. దేశ భద్రత కోసం అని చెప్పి అభిప్రాయ స్వేచ్ఛను కత్తిరిస్తున్నారు. చైనా, ఇజ్రాయెల్ భద్రతా విధానాలు, అనేక దేశాల్లో అమలవుతున్న నిఘా చట్టాలు ప్రజల స్వేచ్ఛను త్యాగం చేసి పాలన సౌలభ్యం కోసం రూ పొందించినవే. మాట స్వేచ్ఛను బంధించి దేశద్రోహి, రాష్ట్ర శత్రువు, అశాంతి కారకు డు వంటి ముద్రలు వేసి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు.
ఇది ప్రజాస్వామ్యా నికి వచ్చిన మౌన మరణశాసనం. న్యాయవ్యవస్థలు ఆలస్యం, ఒత్తిళ్లు, నియామకాల ద్వారా నిర్వీర్యమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే దృశ్యం. ఐక్య రాజ్యసమితి, మానవ హక్కుల సంస్థలు ప్రకటనలు చేస్తాయి గానీ చర్యలు తీసుకోలేకపోతున్నాయి. శక్తివంతమైన దేశాలు మానవ హక్కులు ఉల్లంఘిస్తే ప్రపంచం మౌనంగా ఉంటుంది. బలహీన దేశాలపైనే నీతిపాఠాలు.
ఈ ద్వంద్వ వైఖరి ప్రజా స్వామ్య విశ్వసనీయతను ప్రపంచవ్యాప్తం గా దెబ్బతీస్తోంది. మీడియా పరిస్థితి మ రింత దారుణం. ప్రజాస్వామ్యానికి నాలు గో స్తంభంగా భావించిన మీడియా నేడు అనేక దేశాల్లో అధికారానికి మైకుగా మా రింది. నిజాన్ని ప్రశ్నించాల్సిన మీడియా అధికార ప్రకటనలను చదివే నోటీసు బోర్డుగా మారుతోంది. కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నిస్తే దేశద్రోహులవుతున్నారు.
వారిపై దాడులు, కేసులు, అరెస్టులు పెరుగుతున్నాయి. నిజం చెప్పడం నేరంగా మా రిన సమాజంలో ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందని ఆలోచించాల్సిన సమయమిది. సాంకేతికత ప్రజాస్వామ్యాన్ని బలో పేతం చేయాల్సింది పోయి నిఘా వ్యవస్థగా మారింది. ప్రజల కదలికలు, మాట లు, అభిప్రాయాలు నిఘా నేత్రాల కిందికి చేరాయి. వ్యక్తి స్వేచ్ఛ అనేది కనుమరుగయింది. సోషల్ మీడియా ప్రజల గొంతు కావాల్సింది పోయి ద్వేషం, అబద్ధాలు, ప్ర చారాలకు వేదికగా మారిం ది.
కొత్త తరహా నియంతృత్వం
నియంతృత్వం కేవలం సైనిక తిరుగుబాట్లతోనే రావడం లేదు. అది ప్రజల ఓటుతోనే అధికారంలోకి వస్తోంది. ఎన్నిక లు గెలిచిన నాయకులు రాజ్యాంగాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల వ్యవస్థలను క్రమంగా తమ ఆధీనంలోకి తీసుకుం టున్నారు. బయటకు ప్రజాస్వామ్యం బతికినట్టే కనిపిస్తుంది. లోపల మాత్రం ప్రజల అధికారం ఖాళీ అవుతుంది.
ప్రత్యర్థులు ఎ న్నికల బరిలో ఉండరు. ఉంటే కేసుల్లో చి క్కుకుంటారు. మీడియా ప్రశ్నించదు. చేస్తే జైలు. ప్రజలు ఓటు వేస్తారు గానీ నిజమైన ఎంపిక ఉండదు. ఇదే ఎలక్టోరల్ ఆటోక్రసీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన రూపం. ప్రజాస్వామ్యం ఒకే విధంగా కూలిపోవడం లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొ క్క తీరు ఎన్నికలు, భద్రత, అభివృద్ధి, మ తం, జాతి కానీ ఫలితం ఒక్కటే. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పాలన కాదు. మైనారిటీల హక్కుల రక్షణ కూడా.
నేడు అనేక దేశాల్లో మెజారిటేరియన్ రాజకీయాలు పెరుగుతున్నాయి. మైనారిటీలు, వలసదారులు, విభిన్న స్వరాలు అందరూ లక్ష్యాలుగా మారుతున్నారు. మెజారిటీ దౌ ర్జన్యం ప్రజాస్వామ్యాన్ని ఫాసిజానికి దగ్గర చేస్తోంది. ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా చెప్పుకునే అమెరికా నేడు తీవ్ర అంతర్గత ప్రజాస్వామ్య సంక్షోభంలో ఉంది. రష్యాలో ప్ర జాస్వామ్యం పేరుకే ఎన్నికలు జరుగుతాయి. నిజమైన ప్రత్యర్థులు ఉండరు. మీ డియా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుం ది. విమర్శకులు జైల్లో ఉంటారు. రాజ్యాం గ మార్పుల ద్వారా ఒకే నాయకుడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండేలా మలి చారు.
-అణచివేత ధోరణులు
ప్రపంచం అంగీకరిస్తున్న చైనా అభివృ ద్ధి మోడల్‌ను సమర్థించడం పెను ప్రమా దం. ప్రజలకు ఓటు హక్కు, మాట స్వేచ్ఛ, నిరసన హక్కు లేదు. నిఘా వ్యవస్థలు ప్రతి పౌరుడిని అనుసరిస్తున్నాయి. టర్కీ లో ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారానే కూ లిపోయింది. అధికారంలోకి వచ్చిన నాయకుడు న్యాయవ్యవస్థను, మీడియాను, సై న్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
జర్నలిస్టులు జైళ్లలో ఉన్నారు. రాజ్యాంగం మారింది. ప్రజల ఓటుతో వచ్చిన అధికా రం ప్రజల మీదే ఆయుధంగా మారింది. యూరప్ ఖండంలోనే ప్రజాస్వామ్యం బలహీనపడుతున్న దేశం హంగేరీ. ఎన్నికలు జరుగుతున్నా మీడియా స్వేచ్ఛ లేదు. న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి లోబడి పనిచేస్తోంది. ఇజ్రాయెల్ తనను తాను ప్రజా స్వామ్య దేశంగా చెప్పుకొంటుంది. పాలస్తీనియన్లకు ఓటు హక్కులు లేని పరిస్థితి, సైనిక పాలన, నిరసనలపై కాల్పులు ఇవి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన వాస్తవాలు. మయన్మార్లో ప్రజలు ఓటుతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సైన్యం ఒక్కరోజులో కూల్చేసింది.
నిరసనకారులపై కాల్పులు, వేలాది అరెస్టులు, వేల సంఖ్యలో మరణాలు సం భవించాయి. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఎప్పుడూ సైన్యం నీడలోనే ఉంది. ఆఫ్రికాలో అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం స్థిరపడక ముందే కూలిపోతున్నది. ఎన్నికల అనంతరం తిరుగుబాట్లు, సైనిక పాలనలు, జీవితకాల అధ్యక్షులు రాజ్యమేలుతున్నారు. ప్రశ్నించే గొంతులపై కేసులు, మీడియాపై ఒత్తిళ్లు, కేంద్రీకరణ, విభజన రాజకీయాలు ప్రజాస్వామ్య ఆత్మను దెబ్బతీస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. అది తీవ్రమైన పరీక్షలో ఉంది. మన మౌనం పెరిగితే ప్రమాదం తప్పదు.
- - - - వ్యాసకర్త సెల్: 8466827118