12-08-2024 01:17:55 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులను అర్హతకు మించిన పోస్టుల్లో డిప్యూటేషన్‌పై నియామకమైనట్లు తెలుస్తోంది. సీనియర్లకు పక్కన పెట్టి జూనియర్ స్థాయి అధికారులకు అందలం ఎక్కించారని, ఈ మేరకు కమర్షియల్ టాక్స్ ప్రిన్సి పల్ సెక్రటరీ, కమిషనర్ రిజ్వీ గత 5 రోజుల పాటు చేసిన సమీక్షల్లో ఇలాంటి ఎన్నో నిజాలు వెలుగు చూసినట్లు తెలిసింది. ఓ జూనియర్ స్థాయి అధికారిని ఇదే విషయం గురించి కమిషనర్ అడగ్గా.. తాను హెడ్డాఫీస్‌లో చేశాను కాబట్టే అదనపు కమిషనర్ అవకాశం వచ్చిందని చెప్పినట్లు సమాచారం. జూనియర్ స్థాయి అధికారులను అందలం ఎక్కించిన ఉదంతం గత కమిషనర్ హయాంలోనే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో డిప్యూటేషన్లు, అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల జాబితాను కమిషనర్ రిజ్వీ సిద్ధం చేస్తున్నట్లు సమచారం.
సీఎం పరిధిలోనే వాణిజ్య పన్నుల శాఖ
రిజ్వీ కమిషనర్‌గా నియామకమైన తర్వాత తొలిసారి సోమవారం హెడ్డాఫీసుకు వచ్చారు. ఆ రోజు నుంచి వరుసగా అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్నారు. శుక్రవారం కూడా దాదాపు రాత్రి 10.30 గంటల వరకు రివ్యూ నిర్వహించినట్లు తెలిసింది. జీఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయి? గతంలో వసూళ్లు ఎందుకు తగ్గాయి? శ్రీదేవి కమిషనర్‌గా వచ్చిన తర్వాత గత 8 నెలల్లో ఎందుకు పెరిగాయి? యూనిట్ల వారీగా జీఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయి? అనే అంశాలను రిజ్వీ అడిగి తెలుసుకున్నట్లు సమా చారం.
ఈ క్రమంలో వాణిజ్య పన్నుల విభాగంలోని ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవి కమిషనర్‌గా వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న పరిస్థితులపై రిజ్వీ ఆరా తీసినట్లు తెలిసింది. ఇలా అందరితో మాట్లాడి శాఖపై సమగ్ర నివేదికను రిజ్వీ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోనే వాణిజ్య పన్నుల శాఖ ఉంది. సీఎం అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయనకు నివేదికను సమర్పించే ఆలోచనలో రిజ్వీ ఉన్నట్లు సమాచారం.
రిజ్వీ, శ్రీదేవి మధ్య విభేదాలు నిజమేనా?
ప్రస్తుత కమిషనర్ రిజ్వీకి మాజీ కమిషనర్ శ్రీదేవికి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దిరికీ పడకపోవడం వల్లే వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీని ప్రభుత్వం నియమించిన సమయంలో కమిషనర్ హోదాలో శ్రీదేవి అడ్డుకునే ప్రయత్నం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. రిజ్వీ నియామకాన్ని ఆపాలంటూ కొందరు అధికారులను సీఎస్ వద్దకు శ్రీదేవి పంపినట్లు తెలిసింది. కానీ అందుకు సీఎస్ అంగీకరించలేదని సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఈ పరిణామం వల్లే శ్రీదేవి కమిషనర్‌గా ఉన్న కాలంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆఫీసులో జరిగిన ప్రతి అంశంపై రిజ్వీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
జీఎస్టీ స్కామ్‌పై పునర్విచారణ!
రూ.1,400 కోట్ల జీఎస్టీ స్కామ్ జరిగినట్లు కమిషనర్ హోదాలో శ్రీదేవి తన విచారణలో తేల్చిన విషయం తెలిసిందే. దీనిపై జాయింట్ కమిషనర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఇదిలా ఉంటే శ్రీదేవిపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో తనకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకొని అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్లో నిజమెంత అనే విషయాలను తెలుసుకునే పనిలో రిజ్వీ ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, జీఎస్టీ స్కామ్ ఎలా జరిగింది? ఇంకా ఎక్కువ మొత్తంలో జరిగిందా? శ్రీదేవి హయంలో విచారణ ఎలా జరిగింది? అనే విషయాలపై రిజ్వీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జీఎస్టీ స్కామ్‌పై అంతర్గతంగా పునర్విచారణ చేసే యోచనలో రిజ్వీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.