calender_icon.png 13 August, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం గురుకుల పాఠశాలను సందర్శించిన జిసిసి చైర్మన్ తిరుపతి

13-08-2025 08:28:23 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణం శివారులో గల గిరిజన గురుకుల బాలికల(Tribal Gurukulam girls) కళాశాలను బుధవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి సందర్శించారు. తొలుత భోజనశాలకు వెళ్లి వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థినిలతో కలిసి అల్పాహారం తీసుకొని విద్యార్థులతో మాట్లాడారు. వంటశాలను, స్టాక్ రూములను పరిశీలించి వంట సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భోజనంలో, విద్యాపరంగా వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ తో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని, గతంలో కంటే మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

గతంలో విద్యా సంవత్సరం ప్రారంభం తర్వాత చాలా ఆలస్యంగా పుస్తకాలు, దుస్తులు వచ్చేవని ఇప్పుడు పాఠశాల మొదటి రోజే అవన్నీ విద్యార్థులకు అందించడం చాలా సంతోషకరమన్నారు. గతంలో మెస్ చార్జీలకంటే సుమారు నలబై శాతం అదనంగా చెల్లించడం వలన పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనం అందించేందుకు వీలు ఉంటుందని అందుకు కళాశాల ప్రిన్సిపల్, వార్డెన్ లు పూర్తిస్థాయిలో పిల్లలకు భోజనం అందించేందుకు తగు చొరవ తీసుకోవాలన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున పిల్లల హాస్టల్ కిటికీలకు తప్పనిసరిగా మెస్ లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల పూర్తిస్థాయిలో ఆరోగ్య సిబ్బంది అవగాహనతో పనిచేయాలని, మందులన్నీ సక్రమంగా అందుబాటులో ఉంచుకోవాలని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మరెన్నో శిఖరాలు అధిరోహించి, చదువుకున్న కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఉన్నత స్థానాలలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థినిలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని వీటిలో కొంతమంది లెక్చరర్లు లేకపోవడం వలన సబ్జెక్టులు కోల్పోతున్నామని చెప్పారని దానికి సంబంధిత అధికారులతో మాట్లాడి సబ్జెక్టు అధ్యాపకులను నియమించేందుకు తగు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిసిసి డివిజనల్ మేనేజర్ సమ్మయ్య, భద్రాచలం డిపో మేనేజర్ జయరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లం నరేష్, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్, కాటిబోయిన సాయి తదితరులు పాల్గొన్నారు.