12-08-2024 12:49:35 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలను ఆ పార్టీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ సీనియర్లు తమకు అనుకూలమైన వారు ఎన్నికయ్యే విధంగా పావులు కదుపుతున్నారు. యూత్ కాంగ్రెస్ పదవిని దక్కిం చుకుంటే భవిష్యత్‌లో మంచి అవకాశం ఉం టుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల్లో మెజార్టీగా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలో పని చేసినవారే ఉన్నారు. దీంతో యూత్ కాంగ్రెస్ పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. కాగా, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో డజన్ మంది, ప్రధాన కార్యదర్శి పోస్టుకు 88 మంది యువజన నాయకులు పోటీ పడుతున్నారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 23 మంది నామినేషన్ వేశారు. అయితే యూత్ కాంగ్రెస్ పోటీ చేయడానికి 34 ఏళ్లు పరిమితి విధించడం తో 12 మంది అధ్యక్ష పదవికి పోటీకి అర్హత సాధించారు. అందులో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూం కుంట నర్సారెడ్డి కూతురు అంక్షారెడ్డి పోటీ పడుతున్నారు. వీరితో జక్కిడి శివచరణ్‌రెడ్డి, పొన్నం తరుణ్‌గౌడ్, జీ అర్వింద్, మిట్టపల్లి వెంకటేశ్, హరిప్రసాద్, మహ్మద్ ఇసాక్, సామ్రాట్ వంశీ, షేక్ కైజర్, థామస్, దీపక్ ప్రజ్ఞ పోటీలో ఉన్నారు. ఇక యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి 130 మంది నామినేషన్ దాఖలు చేయగా 88 మంది పోటీకి అర్హత సాధించారు.
రేపటి నుంచి సభ్యత్వ నమోదు
కాంగ్రెస్‌లో పార్టీ అనుబంధ సంఘాల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇస్తుంటారు. కానీ, యూత్ కాంగ్రెస్ పదవుల ఎంపిక విషయంలో అందుకు భిన్నంగా ఉంటుంది. యూత్ కాంగ్రెస్‌కు ఎన్నికలు నిర్వహించి వారిలో విజయం సాధించిన వారికే పదవిని కట్టబెడుతారు. ముందుగా నెలరోజుల పాటు ఆన్‌లైన్‌లో యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదును స్వీకరిస్తారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఒకవైపు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటూనే మరోవైపు అన్ని పదవులకు ఆన్‌లైన్‌లోనే ఓటింగ్ జరుగుతుంది. వీరిలో ఎక్కువగా ఓట్లు వచ్చిన వారిని విజయం వరిస్తుంది.
అందుకు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడే వారు రాష్ట్రవ్యాప్తంగా తమకు అనుకూలమైన వారిని ఎక్కువగా మెంబర్‌షిప్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సహకారం తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం, రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉండటంతో తన అనుచరులు సభ్యత్వ నమోదుపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఇక యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాత్రం జక్కడి శివచరణ్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు చెబుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తన కూతురు అంక్షారెడ్డిని గెలిపించుకునేందుకు పార్టీ ముఖ్య నాయకుల సహకారం కోరుతున్నారు. మిగ తా నాయకులు కూడా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించి విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్లుతున్నారు.