15-09-2025 12:56:16 AM
అంకిత్ కొయ్య, నీలఖి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ పతాకాలపై రూపొందిన ఈ సినిమాకు విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేశ్ కుమార్ భన్సల్ నిర్మాతలు. జేఎస్‌ఎస్ వర్ధన్ ఈ చిత్రానికి మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించగా.. కథ, స్క్రీన్‌ప్లేను ఆర్‌వీ సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “బ్యూటీ’ చాలా గొప్ప సినిమా. తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా. ఆడపిల్లల గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలతో, యథార్ఘ సంఘటనలతో ‘బ్యూటీ’ కథను రాశారు” అని తెలిపారు. ‘మామూలు టికెట్ రేట్లతో సినిమాలు వస్తే జనాలు థియేటర్లకు వస్తున్నారని సినీ పెద్దలు గుర్తించాలి’ అని ఎస్‌కేఎన్ అన్నారు. హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. “మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ థియేటర్ విజిట్‌కు వెళ్తే.. మంచి చిత్రాలు చేస్తున్నావ్ అంటూ ఓ పెద్దాయన అన్న మాటలు నాలో ఎంతో స్ఫూర్తి నింపాయి. మంచి పాత్రలు, మంచి చిత్రాలు చేసుకుంటూ వెళ్తే.. ప్రేక్షకులు మనల్ని హీరోను చేస్తారని అర్థమైంది.
‘బ్యూటీ’ చిత్రం ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు. చూడండి.. నచ్చకపోతే సున్నా రేటింగ్ ఇవ్వండి.. నచ్చితే ప్రమోట్ చేయండి” అని చెప్పారు. హీరోయిన్ నీలఖి మాట్లాడుతూ.. “మేం తెలుగు వాళ్లమే. కానీ ఒడిస్సాలో సెటిల్ అయ్యాం. తెలుగు కల్చర్ నాకు కొత్తేమీ కాదు. నాకు ‘బ్యూటీ’ మొదటి చిత్రం. ఇందులో నేను అలేఖ్య పాత్రను పోషించాను” అని తెలిపింది. ‘బ్యూటీ’ ప్రతి ఒక్కరినీ సీటులో కూర్చోబెడుతుంది’ అని డైరెక్టర్ జేఎస్‌ఎస్ వర్ధన్ అన్నారు.
నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి అడిదల మాట్లాడుతూ.. “వందల కోట్లు సంపాదించాలని వానరా సెల్యూలాయిడ్‌ను ప్రారంభించలేదు.. మం చి చిత్రాల్ని నిర్మించాలని ఇండస్ట్రీలోకి వచ్చాను. మా ‘బ్యూటీ’ మూవీ అందరికీ నచ్చుతుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు వీకే నరేశ్, వాసుకి, నితిన్ ప్రసన్నతోపాటు కథ, స్క్రీన్ ప్లే రైటర్ ఆర్‌వీ సుబ్రహ్మణ్యం, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, ఆర్ట్ డైరెక్టర్ సురేశ్, జీ స్టూడియోస్ ప్రతినిధి దివ్య, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.