మెరుగైన వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ హరిత
పెంచికల్పేట్/ కాగజ్‌నగర్,మార్చి 24(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ హరిత మంగళవారం పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల నిల్వలు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనుమతి లేకుండా గైర్హాజరు అయ్యే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థుల హాజరు పట్టిక, మెను పట్టిక, సరుకుల నిల్వ గది, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు నాణ్యమైన బోధన ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. తర్వాత బొంబాయి గూడ గ్రామంలోని ఆదర్శ అంగన్వాడీ కేం ద్రం, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఉపాధ్యా యులకు సూచించారు.
వర్షపు బొట్టును ఒడిసి పట్టుకోవాలి-
ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టుకొని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. కాగజ్నగర్ మండలం జంబుగా గ్రామంలో భూగర్భ జల శాఖ, సమృద్ధి సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ నీటి దినోత్సవం2026 కార్యక్ర మంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెక్డ్యాములు, నీటి కుంటలు, బోర్ల సమీపంలో ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచవచ్చన్నారు.
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే తాగునీటి, సాగునీటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న శుద్ధజలాన్ని ప్రజలు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్, ఉద్యానవన శాఖ అధికారి నదీం, మిషన్ భగీరథ, మత్స్య శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




