calender_icon.png 14 August, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్స్ కేసు.. మంచులక్ష్మిపై ఈడీ ప్రశ్నలవర్షం

14-08-2025 01:55:41 AM

- యోలో 247 యాప్ ప్రమోషన్‌పై ప్రధానంగా దృష్టి

- ఈడీ ముందు మంచు లక్ష్మి ఐదేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్లు

- లావాదేవీల్లో హవాలా మార్గాలున్నాయేమోనన్న కోణంలో దర్యాప్తు

- మంచు లక్ష్మి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మిప్రసన్న బుధవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

దాదాపు మూడున్న ర గంటల పాటు సాగిన విచారణలో అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘యోలో 247’ అనే బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన అంశంపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ ప్రమోషన్ కోసం కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుకు ప్రతిఫలంగా అందిన పారితోషికం, ఆర్థిక లావా దేవీల గురించి కూపీ లాగారు. ఈ లావాదేవీల్లో ఏవైనా హవాలా మార్గాలను ఉపయో గించారేమోనన్న కోణంలోనూ ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. విచారణలో భాగంగా మంచు లక్ష్మి తన ఐదేళ్ల బ్యాంక్ ఖాతాల స్టేట్‌మెంట్లను అధికారులకు సమర్పించారు. 

ఏం అడిగారంటే..!

ఈడీ అధికారులు మంచు లక్ష్మిని పలు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. యోలో 247 యాప్‌ను ప్రమోట్ చేయడానికి ఎంతకాలం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు? మీతో పాటు ఈ ఒప్పందంలో ఇంకా ఎవరెవరున్నారు? ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏమిటి? దుబాయ్ సంస్థ నుంచి మీకు అందిన పారితోషికం ఎంత? అది ఫీజు రూపంలో అందిందా? లేక కమీషన్ రూపంలో ఇచ్చారా? ఆ చెల్లింపులు మీకు ఎలా అందాయి? నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేశారా? లేక బిట్‌కాయిన్ల వంటి ఇతర రూపాల్లో చెల్లించారా? ఇది గేమింగ్ యాప్ అని తెలిసి ప్రమోట్ చేశారా? ఒప్పందం చేసుకొనే ముందు ఆ యాప్‌కు ఉన్న చట్టపరమైన అనుమతులు, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ల గురించి విచారించారా? సోషల్ మీడియా వేదికలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఈ యాప్‌కు ప్రచారం కల్పించారు? మీ ఒప్పందం ఎప్పుడు ముగిసింది? ఈ ప్రశ్నలతో అధికారులు మంచు లక్ష్మిని ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం.

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఈడీ ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులను విచారించింది. మంచు లక్ష్మి కంటే ముందు నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ వంటి వారు కూడా ఈడీ ఎదుట హాజరై తమ వాంగ్మూలాలు సమర్పించారు. ఈ కేసులో మొత్తం 29 మందిపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండటంతో, రాబోయే రోజుల్లో మరికొంతమంది ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.