calender_icon.png 16 August, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరుకే ఇనుగుర్తి మండలం!

14-08-2025 01:45:35 AM

  1. తాత్కాలిక వసతిలోనే కార్యాలయాలు!
  2. జాడ లేని పోలీస్ స్టేషన్ కేటాయించని స్థలం
  3. నిర్మించని భవనాలు

మహబూబాబాద్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల ఏర్పాటు కల దాదాపు 35 సంవత్సరాల నిరీక్షణ ఎట్టకేలకు 2022లో నెరవేరింది. అయితే మండలం ప్రకటించి మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ పూర్తిస్థాయి పరిపాలన ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పడ్డ మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పటికీ ఆ మండల పరిధిలోని గ్రామాల ప్రజలు ఆటు నెల్లికుదురు, ఇటు కేసముద్రం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది.

తొలుత తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు సొంత భవనాన్ని నిర్మించలేదు. దీనితో గ్రామపంచాయతీ భవనంలో తహసిల్దార్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయగా ప్రస్తుతం హాస్టల్లో విద్యార్థుల సంఖ్య 40 దాటింది.

ఫలితంగా హాస్టల్లో అటు ఎంపీడీవో కార్యాలయం, ఇటు హాస్టల్ నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీనికి తోడు భవనం పైకప్పు, ఫ్లోరింగ్ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక మండల విద్యా వనరుల కేంద్రాన్ని ఇనుగుర్తి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని రైతు వేదికలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పరిపాలన సమయంలో ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేయాలని ఇనుగుర్తి వాసులు డిమాండ్ చేశారు. అయితే ఇనుగుర్తికి బదులుగా కేసముద్రం మండలాన్ని పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటినుండి 2022 వరకు ఇనుగుర్తి మండల ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఒక దశలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు.

ఈ క్రమంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఇనుగుర్తిని మండలంగా 2022లో ప్రకటించింది. 30 ఎకరాల భూమిని మండల ఆఫీస్ కాంప్లెక్స్ కోసం కేటాయించాలని తీర్మానించారు. అయితే ఇప్పటివరకు స్థల సేకరణ అంశం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీనితో ఇనుగుర్తి మండలం ఏర్పడి ఏం ప్రయోజనం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్తగా ఏర్పడ్డ కార్యాలయాలకు సరైన వసతి లేదని, అలాగే పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, కొన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులను నియమించకపోవడంతో ఇంచార్జీలతో కాలం వెళ్ళదీస్తున్నారని, పూర్తిస్థాయిలో మండల పరిపాలన సాగడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. గతంలో కేసముద్రం, నెల్లికుదురు పరిధిలోని ఉన్న గ్రామాలను కలిపి ఇనుగుర్తి మండలం గా ఏర్పాటు చేసినప్పటికీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు పోలీసు సేవల కోసం పూర్వ పోలీస్ స్టేషన్లకే వెళ్తున్నామని, ఇతర కార్యక్రమాలకు ఇనుగుర్తికి వస్తున్నామని,

దీనితో ఇనుగుర్తి మండల పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే ఇనుగుర్తిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే మండల ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇనుగుర్తి మండల ప్రజలు కోరుతున్నారు.

పూర్తిస్థాయిలో మండలాన్ని ఏర్పాటు చేయాలి

ఇనుగుర్తి మం డలం పేరుకే ఏర్పాటు చేసినట్లు ఉందని, ఇన్చార్జి అధికారులతోనే కాలం వెళ్లదీస్తున్నారని, ఇప్పటి వరకు ఏర్పడ్డ ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయి ఉద్యోగుల నియామకం జరగలేదు. మండలం ఏర్పడి మూడేళ్లు దాటిపోయినా పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఊసే లేదు.

ఇనుగుర్తి మండలం  ఏర్పాటుచేసిన పెద్దగా ప్రయోజనం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారుల స్పందించి ఇనుగుర్తి మండలానికి పూర్తిస్థాయి అధికా రులను, ఉద్యోగులను నియమించాలి. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించి ప్రజలకు అన్ని విధాల సేవలను ఒకే చోట అందే విధంగా చొరవ చూపాలి.

 దార్ల రామ్మూర్తి, మాజీ సర్పంచ్, ఇనుగుర్తి.