07-07-2025 01:10:26 AM
భద్రాచలం, జులై 6 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం రామాలయ తో పాటు పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేశం న లుమూలల నుండి వేలాది మంది భక్తులు ఆదివారం నాడు సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి రావడం, క్యూ లైన్ ల నిండా భక్తులు నిండిపోవడంతో రామయ్య దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతున్నది.
వివిధ వాహనాల ద్వారా భద్రాచలం చేరుకున్న భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో ఒత్తులు వెలిగించి, పుణ్య స్థానాలు ఆచరించి సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. క్షేమంగా తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్లారు. హిందువుల తొలి పండుగ అయిన తొలి ఏకాదశి సందర్భంగా భద్రాద్రి రామాలయం రామ నామస్మరణతో మారు మోగింది.
ఏకాదశి సందర్భంగా దేవాలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం విశేష పూజలు నిర్వహించారు. అంతేకాకుండా సాయంత్రం స్వామివారు తిరువీధి సేవ పాల్గొంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటులు నిర్వహించారు.