22-09-2025 06:09:03 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో 2025 విశ్వావసు నామ సంవత్సర శ్రీ భద్రకాళి దేవి శరన్నవరత్ర మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభింపబడ్డాయి. ఉదయం గంటలు 04-00లకు నిత్యహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారికి ఉత్సవానుజ్ఞ ప్రార్ధన జరిపారు. అమ్మవారు అనుగ్రహించిందన్న సూచన రాగానే గణపతి పూజ, పుణ్యహవాచనం, ఉత్సవ పూర్వాంగ విధి నిర్వహించిన పిమ్మట అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పంచోధకాలు, ఔషధులు, వృక్షపల్లవ కషాయాలు, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది పలు విధములైన వస్తు సంభారములతో రెండు గంటల పాటు సాగిన ఈ అమ్మవారి అభిషేకం ఒక అమితమైన ఆనందాన్నికలిగించింది.
అనంతరం నవరాత్రులను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు, ఎంపీ కడియం కావ్యకు ఆలయ చైర్మన్ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం ధర్మకర్తలు తణుకునూరు వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోత్కూరి మయూరి, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగు ఆంజనేయులు, భారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్, మూగ శ్రీనివాస్, మరియు కార్యనిర్వహణాధికారి రామల సునీత, ప్రధాన పూజారి భద్రకాళి శేషు గారు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ రోజు భేరీపూజ జరిపిన అనంతరం ఉత్సవాల ద్వజారోహణం జరిపారు. అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా అలంకరించి పూజారాధనలు జరిపిన తర్వాత అమ్మవారిని ఉదయం వృషభ వాహన సేవ మీద సాయంకాలం మృగవాహన సేవ మీద ఊరేగించారు. వృషభ వాహన సేవ మీద ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడంవలన ధర్మశ్రద్ద, మృగ వాహన సేవమీద ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడం వలన చంచలత్వాన్నివీడి మనస్సు సాధనలో నిమగ్నమై సాధకుడి సాధన సక్రమంగా సాగుతుందని భద్రకాళి శేషు తెలిపారు.
అట్లే బాలా త్రిపురసుందరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించిన భక్తులకు కుండలినీ శక్తి జాగృతమై సాధనకు ఆటంకం కలిగిస్తున్న అసూరీ శక్తులను దూరం చేస్తుంది. కుండలినీ శక్తి జాగృతమైన సాధకులకు సకలార్ధసిద్ది కలుగుతుంది. ఈ రోజు ఉభయ దాతలైన ప్రముఖ పారిశ్రామికవేత్త బాసాని విశ్వప్రకాశ్ –శోభ దంపతులు, బాసాని సాయి వీక్షిత్ రాజ్-డాక్టర్ నిహంతి దంపతులు, బాసాని కావ్యత్, హైదరాబాద్ వాస్తవ్యులు దొంతుల కృష్ణారెడ్డి సుధా దంపతులు తోట కిరణ్ కుమార్ కీర్తి దంపతులు మహేష్ జాజు భావన జాజి దంపతులు మరియు దేవరాజ్ బజాజ్ సుశీల దంపతులకు పూజానంతరం అమ్మవారి శేషవస్త్రములు బహుకరించి ప్రసాదములు ఆందజేశారు.
తదుపరి నవరాత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేద పారాయణం, మాన్యుసూక్త సహస్రావర్తన పురస్సర మారుతి యాగం, శత చండీ యాగం, మహారుద్ర యాగం, గణేశ యాగం, సుదర్శన యాగం, సౌరయాగం, మహాలక్ష్మి యాగం, దశమహావిద్య యాగం, దుర్గా యాగం, సరస్వతి యాగం నిర్వహించుటకు దాతలచే యాగ సంకల్పం చేయించి యాగములు ప్రారంభిచారు. అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి.