22-09-2025 06:14:12 PM
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
తాండూరు,(విజయక్రాంతి): ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మాత శిశు ఆసుపత్రిలో సోమవారం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి గ్రామానికి చెందిన అఖిల(21) ప్రసవం కోసం గత రాత్రి ఆసుపత్రికి వచ్చింది.
అయితే నేడు సోమవారం ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ నగరానికి తీసుకెళ్లాలని సూచించారు. ఇంతలోనే ఆమె పురిటి నొప్పుల బాధతో మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే అఖిల మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం కావాలంటూ ఆసుపత్రి ముందు బయటాయించారు. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న అఖిల కానరాని లోకాలకు పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.