calender_icon.png 22 September, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగుడిపై అసహనం ప్రవర్తించిన జేసీ

22-09-2025 07:36:52 PM

జేసీపై చర్యలు తీసుకోవాలి

వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుల  డిమాండ్

సిద్దిపేట: పెన్షన్ మంజూరు కోసం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చిన 100 శాతం వికలాంగుడిపై సిద్ధిపేట జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) దురుసుగా, అసహనంగా ప్రవర్తించారని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ దండు శంకర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మొక్కపల్లి కనకరాజు, మెదక్ జిల్లా అధ్యక్షులు బాచుపల్లి పాండు అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామానికి చెందిన నాందిరి రవి అనే వికలాంగుడు, రెండు చేతులు కోల్పోయి పూర్తి స్థాయి(100%) వైకల్య సర్టిఫికేట్ కలిగి ఉన్నారు. ప్రభుత్వ పింఛన్ పొందేందుకు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్న రవి, సోమవారం ప్రజావాణిలో అధికారుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లేందుకు కలెక్టరేట్‌కు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా జేసీని కలిసి “సార్, దయచేసి చూడండి. నాకు రెండు చేతులు లేవు. పింఛన్ కావాలి,” అని విజ్ఞప్తి చేయగా, జేసీ మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ, “పెన్షన్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. రాజకీయం చేస్తున్నారా?” అంటూ తీవ్ర స్థాయిలో దబాయించారనీ ఆరోపించారు.

వారి విన్నపాన్ని పరిశీలించకుండానే, దరఖాస్తుపై సంతకం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ అన్నారు. జేసీ తీరు వివక్షతను స్పష్టంగా చూపుతోందని, అధికారిగా సామాన్య ప్రజల సమస్యలపై కనీస సహానుభూతి లేకుండా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. వికలాంగుల పట్ల అసహనంగా ప్రవర్తించడం, సమస్యను అర్థం చేసుకోవాలనే ప్రయత్నం లేకుండా రాజకీయ విమర్శలతో బాధితుడిని నొప్పించడమే కాక, దరఖాస్తును పరిశీలించకుండా తిరస్కరించడం బాధాకరం అన్నారు. వికలాంగుల హక్కులను పరిరక్షించేందుకు రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం-2016 కేవలం పేరుకే మిగిలిపోతున్నదని, నిబంధనలు అమలులో పూర్తిగా విఫలమవుతున్నాయన్నారు. జేసీ తీరుపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆయనను బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి  తక్షణం జోక్యం చేసుకోవాలని వికలాంగుల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో మహిళా అధ్యక్షురాలు ఏం.స్వరూప మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుమార్ మెదక్ జిల్లా కన్వీనర్ వాసు రామ్ మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు గంగాపురం సంజీవులు, పింఛన్ బాధితుడు నందిని రవి, పాల్గొన్నారు.