11-08-2025 12:55:20 AM
మరింత అభివృద్ధి పథంలో వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు
అన్ని అనుమతులున్న ప్రాజెక్టులకు హైడ్రాతో ఎలాంటి ఇబ్బంది లేదు
ఫ్రీలాంచ్ ఆఫర్లతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
ప్రత్యేక ఇంటర్వ్యూలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ జయదీప్‌రెడ్డి
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కె ట్ స్థిరమైన వృద్ధి, స్థిరమైన డిమాండ్, పెరుగుతున్న కొనుగోలుదారుల విశ్వాసంతో బలమైన, సానుకూల దృక్పథా న్ని చూపుతూనే ఉందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్ జైదీప్‌రెడ్డి పేర్కొంటున్నా రు. 2025, మే నెలలోనే ఆస్తి రిజిస్ట్రేషన్లు రూ.4,300 కోట్లు దాటాయి. ఇది 14 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
నగరంలో పెరుగుతున్న ఉపాధి కేంద్రాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, బలమై న మౌలిక సదుపాయాలతో ఈ బలం పాతుకుపోయింది. ప్రపంచ సంస్థల నుంచి బలమై న డిమాండ్ కారణంగా 2030 నాటికి నగరం 200 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్టాక్‌ను జోడించే అంచనాతో భవిష్యత్తు మరింత బలంగా కనిపిస్తోంది. గత బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మెట్రోరైలు విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వంటి నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాన పెట్టుబడులను ప్రకటించింది. ఇవి కనెక్టివిటీని పునర్ని ర్మించనున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ ప్రాజెక్టులన్నీ ప్రారంభించిన తర్వాత, నగరం భారీ మౌలిక సదుపాయాలకు నెలవుగా మా రుతుంది. భవిష్యత్తులో నగరం ప్రధాన ప్రపం చ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉద్యోగాల సృష్టి, గృహాల డిమాండ్‌లో స్థిరమైన వృద్ధిని నమోదుచేస్తూనే హైదరాబాద్ నగరం మున్ముందు కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు.
రియల్ ఎస్టేట్ పరిశ్రమలో క్రెడాయ్ ప్రాథమిక పాత్ర ఏమిటి. దాని సభ్యులకు ఎలాంటి మద్దతును తెలియజేస్తుంది?
క్రెడాయ్ ఎప్పుడూ మా మెంబర్లకు ఒక పెద్దన్న పాత్రను పోషిస్తూ ఏ విధమైన సహా య సహాకారాలు కావాలన్నా ముందుంటుం ది. క్రెడాయ్ ఫౌండేషన్ మెంబర్లు, మా దగ్గర ఉన్న ఆర్గనైజ్డ్ టీమ్, యూత్ వింగ్ అందరం కలిసి ప్రతిఒక్కరి సమస్యను తీర్చడానికి సహా యం చేస్తూనే ఉంటాం. ఇందులో ఉన్న వా ళ్లందరూ స్వతహాగా బిల్డర్లవడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా మా మెంబర్లతో కలిసి టీమ్ వర్క్‌తో ముందుకు సాగిపోతుంటాం.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా అభివృద్ధి చెందుతోంది, ఈ నగరంలో ఉన్న ప్రత్యేక అవకాశాలు, సవాళ్లు ఏమిటి?
హైదరాబాద్ అతిపెద్ద మహానగరంగా అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల సమస్యలు కూడా ఉంటాయి. హైదరాబాద్‌లో నివసించాలనుకొనే ప్రతి ఒక్కరికీ ఒక స్వంత ఇల్లు అనేది కల. అది అందుబాటు ధరలోనా, మిడ్‌సైజ్‌లోనా లేక ప్రీమియంగా ఉండాలనేది వినియోగదారుడి ఇష్టం. ఇక్కడ వివిధ రకాల ఇళ్లకు గానీ / ఫ్లాట్‌లకు గాని డిమాండ్ ఉంది. ఇళ్లు కట్టడానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడానికి ప్రభుత్వాలతో పనిచేస్తూ హైదరాబాద్ నగరం నలువైపులా అభివృద్ధి చేయాలని మేం వివిధ రకాల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాం.
హైదరాబాద్‌లో స్థిరమైన, బాధ్యతాయుత మైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి భవిష్యత్తు కోసం మీ దృష్టి ఏమిటి?
మనకు ఏ ప్రాజెక్టుకైనా అనుమతి కావాలంటే అన్ని డిపార్ట్‌మెంట్లు అంటే ల్యాండ్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, రెరా లాంటి వాటి దగ్గర చిన్న బిల్డర్ల దగ్గర నుంచి మొదలుకొని మీడియం, పెద్ద బిల్డర్ల సమస్యలు ఏమున్నాయో చూసుకొని అన్నింటికి పరిష్కారం లభించేలా కొత్త ప్రణాళికలతో ప్రతి డిపార్ట్‌మెంట్ దగ్గరికీ మేమే ప్రశ్నలతో పాటు ఆ సమస్యకు జవాబులు కూడా ఇచ్చి ఏ సమస్యను పరిష్కరించాలో సలహాలు, సూచనలు కూడా ఇస్తూ ప్రభుత్వానికి లాభం చేకూరేలా పరిష్కరిస్తున్నాం.
మరింత అవసరమైతే దిగువ స్థాయి అధికారి నుంచి కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సంబంధిత మంత్రి, సీఎం వరకు కూడా వెళ్లి అవసరానికి తగినట్టుగా చర్యలు చేపట్టేలా సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తూ స్థిరమైన అభివృద్ధి ఉండేలా తగు విధంగా ముందుకు సాగుతాం.
రియల్ ఎస్టేట్ (రెరా) చట్టం, దాని అమలుపై క్రెడాయ్ దృక్పథం ఏమిటి?
ప్రతి చట్టాన్ని కూడా క్రెడాయ్ గౌరవిస్తుంది. దాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తుంది. అటువంటి చట్టాల వల్ల ప్రతి వినియోగదారునికి వారికి ఇచ్చిన సమయానికి ఇళ్లు కట్టి ఇవ్వడం ప్రతి బిల్డర్ బాధ్యత. చట్టాలు ఉంటేనే బిల్డర్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రతి ప్రాజెక్టుని నాణ్యతా లోపం లేకుండా వినియోగదారునికి అందజేయడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయి.
ప్రభుత్వం సరసమైన గృహాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై మీ ఆలోచనలు ఏమిటి, దాన్ని మరింత సమర్థవంతంగా ఎలా చేయవచ్చు?
అందుబాటులో ఉన్న గృహాల గు రించి ప్రభుత్వంతో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ గృహాలకు సంబంధించి ట్యాక్స్‌సెన్స్ అనేది ఉండాలని గతంలో మనకు ఒక ఐటీ, ఒక ఐబీ అనే పాల సీ ఉండేది. దాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ పొడిగిస్తే మనకు జీఎస్టీ బెనిఫిట్ ఎయిడ్ ఇన్‌కమ్‌ట్యాక్స్ వస్తుంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టాంప్ డ్యూటీ తగ్గించమని అడగవచ్చు.
ఇంతకుముందు హైదరాబాద్ టైర్ 2 సిటీగా ఉంది. టైర్t సిటీ అవడం వల్ల 60 చ.మీ.ల లిమిట్ ఉంది. అదే టైర్ 90 చ.మీ.ల లిమిట్ ఉంది. మనకు 90 చ.మీ.లను తీసుకొస్తే అందుబాటు గృహాలు నిర్మించాడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
భూసేకరణ, ఆమోదాలు వంటి సమస్యలను పరిష్కరించడానికి క్రెడాయ్ ప్రభుత్వంతో ఎలా పనిచేస్తోంది?
ప్రభుత్వం కొత్తగా వచ్చినపుడు వాళ్ల అప్రూవల్స్ కొన్ని స్ట్రీమ్‌లైన్ చేయాలని ఉంటుంది. ఇంతకుముందు టీస్ బీపాస్ ఉండేది. ఇప్పుడు బిల్డ్‌నౌ అనే ఆన్‌లైన్ పద్ధతిలో ప్రతిదీ అప్రూవల్ పొందవచ్చు. ఇప్పుడు ఫాస్ట్రాక్ పద్ధతిలో గత మూడు నెలలుగా చాలా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ వారికి కూడా వీటికి సంబంధించిన ఫీజులు కూడా రికార్డు స్థాయిలో వచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు మార్కెట్ బాగుంది కాబట్టి చాలా ప్రాజెక్టులు మినిమం లక్ష చ.గ.లతో లాంఛ్ కాబోతున్నాయి. వీటన్నింటి పర్మిషన్లకు చాలా డబ్బు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.
క్రెడాయ్ నైతిక వ్యాపార పద్ధతులు, వినియోగదారుల రక్షణను ఎలా ప్రోత్సహిస్తోంది?
క్రెడాయ్ అనే సంస్థ ఏర్పడిందే విశ్వసనీయత, నమ్మకం, పారదర్శకత అనే వాటిపైన. ఇప్పటికీ కనీసం రెండు ప్రాజెక్టులు అయినా పూర్తి చేసి ఓసీ ఉన్నవాళ్లకే మెంబర్లుగా చేసుకుంటున్నాం. దీన్ని రాబోయే రోజుల్లో మరింత కఠినంగా, పారదర్శకతను పెంపొందించేలా క్రెడాయ్‌ని ఒక ఉన్నతమైన సంస్థగా రూపొందిస్తాం.
గత 10 సంవత్సరాలుగా పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ రెండు సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మరింత వృద్ధి సాధించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు?
వీటి అన్నిటికీ సమాధానంగానే క్రెడాయ్ ఈ ఆగస్టు 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ప్రాపర్టీ షోను హైటెక్స్‌లో పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది. ఈ సారి స్టాల్స్‌కు చాలా డిమాండ్ ఉంది. వీటి ద్వారా దాదాపు ఎన్నో రకాల ప్రాజెక్టులు ఒకే చోట వినియోగదారులకు అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ప్రభుత్వం మారిన ప్రతిసారి కొత్త పాలసీలు కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి దోహదపడుతుంది. త్వరలోనే మనం ఫ్యూచర్ సిటీని కూడా చూడబోతున్నాము. మున్ముందు ఇది ఎంతో అభివృద్ధిని సాధించడానికి క్రెడాయ్ ఎల్లపుడూ కృషిచేస్తూనే ఉంటుంది.
హైడ్రా వల్ల రియాల్టీ రంగానికి ఏదైనా ఇబ్బంది ఉందా? ఇబ్బందులు ఉంటే అవి ఎటువంటివి? హైడ్రా అనేది రియాల్టీ రంగానికి కలిసొచ్చే అంశమా కాదా?
హైడ్రా అనేది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం. ఇది చెరువులను, కుంటలను కా పాడానికి కాకుండా విపత్తులను కూడా నివారించే సంస్థ. దీని వల్ల ప్రజలందరిలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ ఇప్పుడుచేసే ప్రతి ప్రాజె క్టు సరైన అనుమతులు తీసుకునే ప్రారంభమవుతున్నాయి. రాబోవు రోజుల్లో హైడ్రా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మన భవిష్యత్తు తరా ల కోసమైనా నీటి వనరులను, పార్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం ల్యాండ్ రేట్స్ పెంచుతాం అంటుంది. ఇది రియాల్టీ రంగంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది.
ల్యాండ్ రేట్లు పెరగడం అనేది నిరంతర ప్రక్రియ. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పెరిగితే బాగుంటుంది. అలాగే వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ ఎక్కువగా ఉంది. ఇటీవల ప్రభుత్వాన్ని కలిసి తగ్గించాలని కోరాం. ఎందుకంటే లోన్‌లపై, అగ్రిమెంట్లపై ప్రతి వినియోగదారునికి ఉపయోగపడేలా కొంత పర్సంటేజ్‌ని తగ్గించాలని కోరాం.
వడ్డీ రేట్లు లేదా ఆర్థిక పరిస్థితులలో సంభావ్య మార్పులకు మార్కెట్ ఎలా స్పందిస్తుందని మీరు చూస్తున్నారు?
గృహాలకు వడ్డీ రేట్లు ఇప్పుడు తక్కువ ఉన్నాయి. సీఆర్‌ఆర్ రేట్లు, పీఎల్‌ఆర్ రేట్లు ప్రతి 3 లేదా 6 నెలలకు మారుతునే ఉంటాయి. దీని వల్ల లోన్ తీసుకునే వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది. అందువల్ల బ్యాంకులు కూడా మరింతగా లోన్లు ఇస్తే రియాల్టీ ఇండస్ట్రీ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో గ్రీన్ బిల్డింగ్ పద్ధతులు, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహిం చడానికి క్రెడాయ్ చొరవలు ఏమిటి?
ఐజీబీసీ రేటింగ్స్‌లో ఎన్నో ఉన్నాయి. ఒక్క క్రెడాయ్ మాత్రమే కాదు రాష్ట్రం ప్రభుత్వం కూడా రేటింగ్స్ ఇస్తూ వీటిని ప్రొత్సహిస్తున్నాయి. సహజమైన జీవనం, స్వచ్ఛమైన గాలి ఎక్కువ వెలుతురు వచ్చేలా, తక్కువ నీరు, కరెంటు వినియోగమయ్యేలా మెటీరియల్ వాడేలా చర్యలు తీసుకుంటున్నాం
భారతదేశ మొత్తం ఆర్థిక అభివృద్ధికి క్రెడాయ్ ఎలా దోహదపడుతోంది?
రియల్ ఎస్టేట్ అనేది ఇండియాలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగంలో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు కల్పిస్తోంది. జీఎస్టీ గానీ, ట్యాక్స్ గా నీ, ఎంప్లాయ్‌మెంట్ గానీ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది ఈ రియాల్టీ సెగ్మెంట్‌లోనే. రియల్ ఎస్టేట్ అనేది మనదేశానికి ఒక ఇంధనం వం టిది. దీనిపై ఆధారపడి సుమారు 250 కంపెనీలు ఉన్నాయి. కొవిడ్ తర్వాత ప్రతి కొనుగో లు అడ్వాన్స్ రూపంలోనే జరగడం కూడా ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడుతుంది.
రాబోయే 5 సంవత్సరాలకు క్రెడాయ్ దార్శనికత ఏమిటి. దాని లక్ష్యాలను సాధించడానికి అది ఎలా ప్రణాళిక వేస్తుంది?
క్రెడాయ్ పాలసీ ఏమిటంటే సమాయానుగుణంగా ప్రతి బిల్డర్‌కు వచ్చే సమస్యను ఏలా పరిష్కరించాలో, ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ప్రభుత్వం వద్ద వరకు కూడా వెళ్లి పరిష్కరించాలనుకుంటుంది. అందరూ ఇంజినీర్లే కాదు వేరే వేరే సెగ్మెంట్ నుంచి వచ్చే వారు కూడా ఉంటారు. రెండో తరం వారు రియాల్టీ బిజినెస్‌లోకి వస్తే వారికి శిక్షణ ఇచ్చి వారి సందేహాలను తీర్చి వారిని ప్రోత్సహిస్తూ ఉత్తమమైన బిల్డర్లుగా తీర్చిదిద్దడానికి క్రెడాయ్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్, సరఫరాను నడిపించే ప్రధాన అంశాలు ఏమిటి?
భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్, గత కొన్ని సంవత్సరాలుగా ఇన్‌ఫ్రాస్టక్చర్, మానవ వనరుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ, అభివృద్ధితో పాటు ఎంప్లాయ్‌మెంట్ అభివృద్ధి చెందుతోంది. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు వల్ల చాలా భూములు అందుబాటులోకి వచ్చాయి. ఈ 160 కి.మీ. ఓఆర్‌ఆర్ హైదరాబాద్ గేమ్ ఛేంజర్, హైదారాబాద్‌కు గుండెకాయ వంటింది. ఎక్కడికి వెళ్లినా ప్రయాణ సమయం కూడా తగ్గింది. అందుబాటు ధరలో గృహాలు నిర్మించాలంటే తక్కువ ధరలో భూములు ఉంటేనే చేయగలం. అది సాధ్యమైతేనే ప్రతి సామాన్యుడి ఇంటి కల నెరవేరుతుంది.
సాంకేతికత రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా మారుస్తోంది. ఈ పరివర్తనలో క్రెడాయ్ ఏ పాత్ర పోషిస్తోంది?
గతంలో మనకు హైదరాబాద్‌లో 5 నుంచి 7 అంతస్తుల వరకు మాత్రమే నిర్మించగలిగే సామర్థ్యం ఉండేది. కానీ ఇప్పుడు 60 నుంచి 70, 80 అంతస్తుల వరకు కూడా ప్రాజెక్టులు చేపడుతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఈ హైరైజ్ భవనాలను అతి తక్కువ సమయాల్లో కట్టగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాం. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని మనకు అవసరమయ్యే ఎక్విప్‌మెంట్స్‌ను వాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ నిర్మాణాలు చేపడుతున్నాం. అలాగే వినియోగదారులకు చెప్పిన సమయానికి వారికి అందజేయడానికి కృషిచేస్తున్నాం.
ప్రీ లాంచ్ ఆఫర్‌లపై వినియోగదారులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
ప్రీ లాంచ్ ఆఫర్‌లకు ఆశపడి ప్రజలు ఎవ్వరూ కూడా మోసపోవద్దు. ఎందుకంటే ప్రతిఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన డబ్బులను ఎక్కడో తక్కువకు ఆస్తి వస్తుందని తీసుకుంటే ఒకవేళ వారి ప్రాజెక్టులకు అనుమతులు రాకపోతే ప్రారంభించకుండానే ఆ కంపెనీల ను ఎత్తివేస్తే దానికి ఎవరూ బాధ్యులు? అందుకనే ఇల్లు కొనాలనుకొనే వాళ్లు రెరా పర్మిషన్ పొందిన బిల్డర్ల దగ్గరే కొనుగోలు చేయండి. చింతలేని సుఖవంత మైన జీవితాన్ని పొందండి.