11-08-2025 01:23:11 AM
సిద్దిపేట, ఆగస్టు 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, బీఆర్‌ఎస్ ప్రజల గుండె ల్లో చిరస్థాయిలో నిలుస్తోందని ఆ పార్టీ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణం 20వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమం పరంగా తెలం గాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రతి వార్డులో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన మహ్మద్ ఇంతియాజ్, అజిముద్దీన్, రెహాన్, ఆరీఫ్, మోహిన్, సల్మాన్, నవాజ్, ఖాజాపాషా, రహీం తదితరులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సేవలోనే పరమాత్ముడు..
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జరిగిన అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యుల సత్కార కార్యక్రమంలో హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాల్గొన్నారు. 14 ఏండ్లుగా అమర్‌నాథ్‌యాత్రలో 35 రోజులు భక్తులకు అన్నదానం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపారు.
2010లో సిద్దిపేట నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినవారు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేస్తూ.. ‘తెలుగు భోజనం దొరక్క ఇబ్బంది పడ్డ సందర్భంలో 2011లో 21 మంది కలిసి సమితిని ప్రారంభించగా ఇప్పుడు 190 మంది సభ్యులు పైగా చేరారన్నారు. సిద్దిపేట పేరును దక్షిణ భారతం లో నిలిపిందని హరీశ్‌రావు ప్రశంసించారు.