15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాచకొండ గుట్టల్లో భైరవుడు!

17-02-2026 01:29 AM
  1. ద్విభంగిమలో, వైతస్తిక పాదాలతో నిల్చున్న శిల్పం
  2. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండలంలోని రాచకొండ గ్రామంలోని రాచకొండ గుట్టల్లో తాను దర్శించిన భైరవశిల్పం గురించి కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్ సమీక్షించారు. రాచకొండ గుట్టల్లోని భోగందాని మంటపం, గణపతి శిల్పాల నడుమ పెద్దరాతి గోడ మీద చెక్కివున్న 9 అడుగుల ఎత్తున్న భైరవుని ఉల్బణశిల్పం చాలా ప్రత్యేకమైందని చంద్రకాంత్ వివరించారు.

ఈ భైరవుడు ద్విభంగిమలో, వైతస్తిక పాదాలతో చతుర్భుజుడుగా నిల్చున్నాడని, ఈ శిల్పంలో పరహస్తాల్లో ఢమరుకం, త్రిశూలాలు, నిజహస్తాల్లో బలిఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సులున్నాయని చెప్పారు. ఆ శిరస్సు కింద రక్తం కోసం పైకెగురుతున్న శ్వానం కనిపిస్తున్నదని, ఆ పక్కన ఒక భక్తుడు సాగిలపడి మొక్కుతున్నట్లు శిల్పం ఉందన్నారు. భైరవుడికి కుడి పక్కన మరిగాలు పెట్టి, యోగబంధంతో కూర్చున్న రాజోపాసకుడు పాత్రలోని రక్తప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్లు కన్పిస్తోందని వివరించారు. అతడు పులిచర్మం మీద కూర్చున్నట్టు ఉన్నదని,

ఇది రాచకొండ వెలమల ‘రణం కుడుపు’లను గుర్తు తెస్తున్నదని చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. భైరవుని తలమీద రెండు సర్పాలల్లుకున్న నాగతోరణం, భైరవునికి నాగకిరీటం ఉన్నాయని చెప్పారు. నోట్లో కోరలున్నాయని, భైరవుని చెవులకు నాగాభరణాలు, మెడలో హార, గ్రైవేయకాలు, వక్షం మ్మీద, మోకాళ్లమీద నాగబంధాలు, చేతులకు కంకణాలు, కాళ్లకు కడియాలు, ఎత్తులు కట్టిన పాదుకలు ఉన్నాయని వివరించారు. ఈ భైరవుడు కాకతీయానంతర శైలి తాంత్రిక భైరవుడని, రాచకొండ వెలమలు భైరవోపాసకులుగా ప్రసిద్ధులని చరిత్రబృందం కన్వీనర్ పేర్కొన్నారు.