calender_icon.png 17 May, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారం కోసం... భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం

16-05-2025 06:57:22 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

లక్షెట్టిపేట: భూసమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట, దండేపల్లి మండల తహశిల్దార్ కార్యాలయాల్లో భూభారతి, నూతన ఆహార భద్రత కార్డుల ప్రక్రియను తహశిల్దార్లు దిలీప్ కుమార్, సంధ్యా రాణిలతో కలిసి వేరు వేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి రిజిస్టర్లు, రికార్డులు, పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

నూతన చట్టంలో రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం, సంబంధిత వారసులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిచినట్లయితే పరిష్కరించేందుకు మరింత అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హత గల నిరుపేదలకు ఆహార భద్రత కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం మండలంలోని జెండావెంకటాపూర్, బలరావుపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల అదనపు బోనస్ అందించడం జరుగుతుందని, వరి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, నీడ, ఓ. ఆర్.ఎస్. సౌకర్యాలు కల్పించడంతోపాటు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.

ఈ క్రమంలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన కొనుగోలు కేంద్రాలలో హమాలీలను సమీప కొనుగోలు కేంద్రాల నుండి సర్దుబాటు చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదు జారీ చేయాలని, రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.