calender_icon.png 25 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ కోవిదులతో చర్చిద్దాం

25-08-2025 02:19:47 AM

-బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ కసరత్తు

- ఫోన్‌లో అడ్వొకేట్ జనరల్ సలహా స్వీకరణ

- న్యాయ నిపుణులతో చర్చించాలని నిర్ణయం 

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై మంత్రుల కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదివారం ప్రజాభవన్‌లో జరిగిన  సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరై, బీసీ రిజర్వే షన్ల అమలుపై ఎలా ముందుకెళ్లాలనే అం శంపై ప్రత్యేక కసరత్తు చేశారు.

ఈ నేపథ్యం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా సలహా ఇవ్వాల్సిందిగా అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని ఫోన్‌లో అభిప్రాయం కోరారు. ఇదే అంశంపై సోమవారం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఢిల్లీలోని  ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం సైతం తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. కాగా, రాష్ర్టంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం అంశాలతో ప్రభుత్వం కులగణన చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ర్ట ప్రజలకు వాగ్దానం కూడా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఓబీసీ కులగణనను రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా చేపట్టినట్టు మంత్రుల కమిటీ తెలిపింది. సోషియో, ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయీమెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వేలో వచ్చిన ఎంపీరికల్ డాటాను శాసనసభలో ప్రవేశపెట్టి, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్‌కు పంపా మని మంత్రుల కమిటీ తెలిపింది.

ఆ బిల్లు గవర్నర్ నుంచి రాష్ర్టపతి వద్దకు వెళ్లిందని.. ప్రస్తుతం రాష్ర్టపతి వద్ద 5 నెలలుగా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. మరోవైపు సెప్టెం బర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. 

నేడు ఢిల్లీకి సీఎ రేవంత్‌రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి హాజరైన తర్వాత మధ్యాహ్నం సీఎం హస్తినకు వెళ్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో సమావేశమై చర్చించనున్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపైనా సీఎం రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉంది.

పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీఎం చర్చించనున్నారు. ఇక ఓటుచోరీపై కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ఆందోళనలో సీఎం రేవంత్‌రెడ్డికి పాల్గొననున్నారు.