23-05-2025 12:05:01 AM
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టుల పోరాట చరిత్రలో ఒక అధ్యాయం ముగిసినట్టయింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్ అడవుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నంబాళ్లతోపాటు 27 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బెంగాల్‌లో దాదాపు యాభై ఏళ్ల క్రితం సాయుధ పోరాట పంథాతో మొదలైన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు చరమాంకానికి చేరిందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతున్నది.
కొండపల్లి సీతారామయ్య నాయకత్యంలోని పీపుల్స్ వార్, గణపతి నాయకత్వంలో మావోయిస్టు పార్టీగా మారి అది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన ఉ నికిని బలంగా చాటుకుంది. దశాబ్దాలుగా మావోయిస్టు, భద్రతాదళాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో రెండు వైపులా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
ఇన్‌ఫార్మర్లుగా పేర్కొంటూ నక్సలైట్లు కూడా అనేక మంది గ్రామస్థులను, గిరిజనులను చంపుతున్నారని, పోలీసు బలగాలు ఇటు నక్సలైట్లకు సానుభూతిపరులను, పలువురు ప్రజాస్వామిక వాదులను చంపిన ఘటనలు అనేకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పు డు క్రమంగా మావోయిస్టుల ప్రాభవం సన్నగిల్లిన ఆ పార్టీకి నాయకత్వ స్థానంలో వున్నవారు తెలుగు రాష్ట్రాల వారే అయినందున..
ఆ పార్టీకి సంబంధించిన ప్రతిఘటన రెండు రాష్ట్రాల్లో ఆసక్తిని కలిగిస్తూ వస్తున్నది. భూమి కోసం, వనరుల పరిరక్షణ కోసం నక్సల్స్ చేసిన పోరాటం రెండు రాష్ట్రాల్లోని పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రజాదరణను చూరగొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే వామపక్ష తీవ్రవాదం కార్యకలాపాలు ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొన్నది.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనేకమంది మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి లొంగిపోయారు. గత కొన్నేళ్లుగా పెరిగిన భద్రతదళాల అణచివేత చర్యలతో మావోయిస్టుల కార్యకలాపాలు ఛత్తీస్‌గఢ్‌కు, ఆ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు పరిమితమయ్యాయి. దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ నక్సల్స్ సాయు ధ పోరాటానికి కారణమైంది.
1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయినప్పుడే బెంగాల్‌లో చారుమజుందార్ నాయకత్వాన నక్సల్బరీ పోరాటం మొదలైంది. 1974 నుంచి రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ), రైతుకూలీ సంఘం కార్యక్రమాలు తెలంగాణలో ప్రస్ఫుటం గా కనిపించాయి. 1978లో జగిత్యాల జైత్రయాత్ర భూస్వామ్య వ్యవస్థను కుదిపేసింది. మూడు దశాబ్దాలుగా వచ్చిన అనేక పరిణామాలు సాయుధ పోరోటాన్ని ప్రశ్నార్థకం చేశాయి.
మరోవైపు ప్రభత్వాలు కూడా ఏకపక్ష ధోరణి అన్నట్టుగా మావోయిస్టు పార్టీ, అనుబంధ సంఘాలను నిషేధించి అణచివేతకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించాయి. నంబాళ్ల మృతితో ఇప్పుడు మావోయిస్టు పార్టీ చరిత్రలో అగ్రనేతను కోల్పోయింది. మావోయిస్టులకు ఇక నాయకత్వం వహించేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతున్నది. మల్లోజుల వేణుగోపాల్, తిప్పర్తి తరుపతి పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా తెలంగాణ ప్రాంతం వారే.