13 April, 2026 | 8:22 AM

దీపావళి తర్వాత మహా ఎన్నికలు!

18-08-2024 01:41 AM

ముంబై, ఆగస్టు 17: దక్షిణాదిలో అత్యంత కీలకమైన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేననే వాదన వినిపిస్తున్నది. జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వాటితోపాటే జరుగాల్సిన మహారాష్ట్ర ఎన్నికలను మాత్రం భద్రతాదళాల కొరత, పండుగలను కారణంగా చూపి వాయిదా వేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికలు ఇప్పట్లో ఉండబోవని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నవంబర్ 2వ తేదీన దీపావళి పండుగ ఉన్నది ఆ తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగానే మహారాష్ట్రలో ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని రాష్ట్రంలో ప్రతిపక్ష మహావికాస్ అగాఢీ (ఎంవీఏ) ఆరోపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి ఓటమి తప్పదన్న భయంతోనే ఎన్నికలను వాయిదా వేశారని విమర్శిస్తున్నది.