టర్కీ పార్లమెంటులో ముష్టియుద్ధం
భీకరంగా కొట్టుకొన్న పార్లమెంటు సభ్యులు
అంకారా, ఆగస్టు 17: టర్కీ పార్లమెంటులో వీధిపోరాట దృశ్యాలు దర్శనమిచ్చాయి. అధికార, విపక్ష సభ్యులు ఎగిరెగిరి తన్నుకోవటం తో పలువురికి గాయాలయ్యి నెత్తురోడారు. పార్లమెంటు భవనంలో చాలాచోట్ల రక్తపు మరకలు ఏర్పడ్డాయి. ఎంపీలు పొట్టుపొట్టుగా కొట్టుకొంటున్న వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
ఆరోపణలపై మొదలైన రగడ
అధికార పార్టీ సభ్యులపై విపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేయటంతో గొడవ మొదలైంది. అటలే అనే అధికారపార్టీ ఎంపీ 2013లో ఒస్మార్ కవాలా అనే మతగురువుతో కలిసి దేశవ్యాప్తంగా గెజి పార్క్ నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నించారు. ఈ నేరానికి ఆయనకు 2022లో 18 ఏండ్ల జైలు శిక్ష పడింది. ఒస్మాన్‌తోపాటు మరో ఆరుగురు ఉద్యమకారులు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అటలే మాత్రం గత ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ ఆఫ్ టర్కీ తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
శుక్రవారం సభలో విపక్ష పార్టీ ఉప నేత అహ్మెట్ సిక్ మాట్లాడుతూ.. అటలేపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని పడగొట్టడా నికి కుట్ర చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి ఇప్పుడు పార్లమెంటులో కూర్చున్నాడని విమర్శించారు. అతిపెద్ద ఉగ్రవాది మనమధ్యనే కూర్చున్నాడు అని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన అధికారపార్టీ సభ్యులు సిక్‌ను పోడియం వద్దనే చుట్టుముట్టి పిడిగుద్దులు కురిపించారు. ఆయనను రక్షించేందుకు విపక్ష ఎంపీలు రంగంలోకి దిగటంతో ముష్టియుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకొన్నారు. దీంతో కొందరికి గాయాలై నేలపై రక్తం చిందింది.




