calender_icon.png 15 October, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల సాధనకు బైక్ ర్యాలీ

15-10-2025 12:44:34 AM

విద్యానగర్ నుంచి గన్‌పార్క్ వరకు భారీ ప్రదర్శన

18న బంద్‌ను జయప్రదం చేయండి: ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల జోవీపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల ఉద్యమం ఉధృతమవుతోంది. ఇందులో భాగంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న తలపెట్టిన రాష్ర్టవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తెలంగాణ రాష్ర్ట బీసీ సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని బీసీ భవన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా గన్‌పార్క్ వరకు ఉత్సాహం గా సాగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. శాంతియుతంగా తలపెట్టిన ఈ బంద్‌కు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి, బీసీల ఐక్యతను చాటాలి అని విజ్ఞప్తి చేశారు.

నేటి నుంచి 18వ తేదీ వరకు రాష్ర్టంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బంద్ విజయవంతం కోసం బైక్ ర్యాలీలు నిర్వహించి, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలను చైతన్యం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వేలాది మంది నామినేషన్లు దాఖ లు చేశాక కోర్టు ఎలా స్టే ఇస్తుందని ప్రశ్నించారు.

ఈ కేసులో 30 బీసీ సంఘాలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశాయని, కనీసం వారి వాదనలు కూడా వినకుండా ఏకపక్షంగా స్టే ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. ర్యాలీలో బీసీ సంఘాల నేతలు గుజ్జ సత్యం, టి రాజ్‌కుమార్, రాజు నేత, అనంతయ్య, రాజేం దర్, పగిళ్ల సతీష్, రమాదేవి, లత, వంశీ పాల్గొన్నారు.