15-10-2025 12:45:39 AM
కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరిక
రామాయంపేట(మెదక్), అక్టోబర్ 14 : రైతులు పండించిన ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, అందులో 430 వరి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే మొదలయ్యాయని అన్నారు.
10 కేంద్రాలకు వరి ధాన్యం రావడం మొదలైందని, దీపావళి తర్వాత మరింతగా వరి ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు...
ధాన్యం సేకరణకు కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ధాన్యం సేకరణకు ఏదైనా సమస్యలు ,అవసరాలు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్ 9281103685 ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, నిత్యానందం, జగదీష్ పాల్గొన్నారు.