19-08-2025 11:03:46 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్,(విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నవంబర్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు. గంగాధర పిహెచ్సిలో 28 ప్రసవాలు జరగడం పట్ల అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలు మొదటి స్క్రీనింగ్ 100 శాతం పూర్తి చేస్తూనే రెండవ స్క్రీనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. చాలా మంది మహిళలు రెండవ సారి ఆరోగ్య మహిళ పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో లభించే ఉచిత మందులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళ, ఆయుష్మాన్ భారత్ పరీక్షలు చేయడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం పెరుగుతుందని, తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచవచ్చని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.