20-09-2025 07:58:58 PM
- ఊర చెరువు వరద కాలువ పునరుద్ధరించాలి
- సమస్యలనుపట్టించుకోని కేసీఆర్ రాజీనామా చేయాలి
- బిజెపి నాయకుల డిమాండ్
గజ్వేల్: ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నీటితో ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి ముంపుకు గురవుతుందని, ఊర చెరువు వరద కాలువను పునరుద్ధరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, బిజెపి పట్టణాధ్యక్షుడు మనోహర్ యాదవ్ లు డిమాండ్ చేశారు. శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిన ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉర చెరువు వరద నీటితో గజ్వేల్ పట్టణ ప్రధాన రోడ్డు, పలు కాలనీలు, హాస్పిటల్స్ ముంపుకు బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ఈ సమస్యకు సిద్దిపేట జిల్లా కలెక్టర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు వెంటనే చూపాలని డిమాండ్ చేశారు. వరద సమస్యపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి సమర్పించి వారం రోజులు గడుస్తున్న ఇలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. గతంలో ఇరిగేషన్ శాఖ తరపున కాలువలను మూసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన వంటేరు ప్రతాప్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరగానే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు విషయాన్ని గాలికి వదిలేశారన్నారు. బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి వెంచర్ కోసం కాల్వలను కూడ్పడం వల్లే దుస్థితి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ ముఖ్య నాయకుల వల్లే తూప్రాన్ రోడ్ ముంపుకు గురైందన్నారు. కెసిఆర్ గజ్వేల్ సమస్యల పరిష్కరిస్తారని, ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకొకపోగా నేడు గజ్వేల్ వైపు కూడ చూడకపోవడం శోచనీయమన్నారు. సమస్యలు పట్టించుకోని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రూపుల కుమ్ములాటలకు తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.