22-11-2025 06:24:00 PM
ఎమ్మెల్యే ఏలేటి..
సామూహిక గేయాలాపన వేడుకలో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
నిర్మల్ (విజయక్రాంతి): స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో 'వందేమాతరం' గేయం దేశభక్తిని నింపిందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారత జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ లో గల తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో సామూహిక వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి వందే మాతరం” గేయం సామూహిక గేయాలాపన వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. బంకించంద్ర చటర్జీ జ్ఞాపకార్థం, యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు వందేమాతర 150 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
వందేమాతర గేయం స్పూర్తితో స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్లవాకారులు పోరాటం చేశారని పేర్కొన్నారు. స్థానిక గురుకుల పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 10వ తరగతి విద్యార్థిని శ్రీజ అర్ధగంటలో ఎమ్మెల్యే చిత్రపటాన్ని వేసి బహూకరించారు. అనంతరం ఖేలో ఇండియా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, పాఠశాల ప్రిన్సిపల్ డేనియల్, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, సత్యం చంద్రకాంత్, విలాస్, కార్తీక్, సాయితో పాటు తదితరులు పాల్గొన్నారు.