05-09-2025 06:06:32 PM
హుజురాబాద్ లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
హుజురాబాద్,(విజయక్రాంతి): నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ, పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల బిజెపి శ్రేణులు సంబరాలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా,హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్రపటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తోందన్నారు. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతీ పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతుందని అన్నారు.
నిత్యవసర వస్తువులు, గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గనుందని, పండుగల సమయంలో పేద కుటుంబాలకు భారత ప్రధాని మోడీ ఇచ్చే బహుమతి అన్నారు. కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పెరిగిన పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయన్నారు. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, పేదల అభ్యున్నతి పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిలువుటద్దం లాంటిదన్నారు.
దసరా–బతుకమ్మ పండుగకు ముందే పేదలకు మోదీ గిఫ్ట్ ఇచ్చారని, పండుగలో పేద కుటుంబాలు కూడా సంతోషంగా కొనుగోలు చేయగలిగేలా జీఎస్టీ పన్నుల భారాన్ని తగ్గించడం హర్షనీయమన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, పేద కుటుంబాల రోజువారీ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఇంటికి అవసరమైన నూనె, పేస్టు, సబ్బు, షాంపూ, బేబీ డైపర్స్.. ఇలా అనేక నిత్యవసర వస్తువులన్నింటినీ 18 శాతంనుంచి కేవలం 5 శాతం కి తగ్గించడం శుభపరిణామం అన్నారు.