05-09-2025 06:13:01 PM
వరి ధాన్యం, రైస్ మిల్లుల దొంగలు అరెస్ట్ అయ్యారా?
ఎమ్మెల్యే అసమర్ధతనే యూరియా కొరతకు కారణం
రెండు కిలోల చొప్పున దోచుకున్న కొనుగోలు కేంద్రాలు
నిజాలు బయట పెడితే తట్టుకోలేవంటున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): రూ.700 కోట్ల అవినీతి వడ్ల కొనుగోలులో జరిగిందని జడ్పీ తీర్మానం చేపించి, సీబీసీఐడీ విచారణ కోరిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పిన మాటలు ఎటూ పోయాయాని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రశ్నించారు. పట్టణంలోని ఐబీ విశ్రాంత భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ... వడ్ల కొనుగోలు అవినీతి, రైస్ మిల్లర్లపై కేసులు ఏమయ్యాయో ప్రేమ్ సాగర్ రావు సమాధానం చెప్పాలన్నారు.
ఎమ్మెల్యే పట్టింపులేనితనం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సరఫరా చేయాల్సింది పోయి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు. కనీస అవగాహన లేకుండా రైతులకు మేలు చేస్తున్నట్లుగా వీడియో కాల్ లో ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు.ఇంటింటికి ఎరువులు పంపిస్తానని రైతులను మభ్య పెట్టడం ప్రేమ్ సాగర్ రావుకే దక్కిందన్నారు. మాజీ సీఎం కెసిఆర్ హయాంలో ఏనాడైనా యూరియా కష్టాలు రైతులకు వచ్చాయా? అని ప్రశ్నించారు.ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్సీగా వున్నప్పుడు ఎప్పుడైనా రైతుల కోసం ఏమైనా మంచి పనులు చేసిన సంఘటనలున్నాయా? అని నిలదీశారు.
గూడెం ఎత్తిపోతల పథకంతో ప్రేమ్ సాగర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని, కడెం కెనాల్ డామేజ్ అయితే స్వయంగా అప్పటి ఎమ్మెల్యేగా తాను మరమ్మత్తులు చేపించినట్లు వివరించారు.గూడెం ఎత్తిపోతల పనుల్లో అన్ని జిల్లాల్లో వాడినట్లుగా నాణ్యమైన పైపులనే వినియోగించినట్లు వివరించారు. అంతేకాకుండా వరిధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని జడ్పీ సమావేశంలో తీర్మానం చేపించి, నేటికీ సీబీసీఐడీ విచారణ ఎందుకు జరగకుండా నీరు గారిపోతుందో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు.వరిధాన్యం కొనుగోలు, రైస్ మిల్లుల్లో అవినీతి అని ప్రజలను పక్క దోవ పట్టించింది ప్రేమ్ సాగర్ రావు కదా? అని మండిపడ్డారు.
ఎమ్మెల్యేగా కనీసం ఏ ఒక్క వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలన్నారు.కొనుగోలు కేంద్రాల్లో నేరుగా 2 కిలోల చొప్పున రైతులను నుంచి దోచుకున్నారని విమర్శించారు.వరికి బోనస్ ఇస్తామని ప్రగాల్భాలు పలికిన తీరును రైతులు మర్చిపోరని గుర్తు చేశారు. ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు, గుట్టలను మాయం చేస్తున్నదేవరో ప్రజలుగమనిస్తున్నారన్నారు.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాకుండా ఏదో కింది స్థాయి కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టి తనపై బూతులు మాట్లాడించడం కాదని, దమ్ముంటే ఎమ్మెల్యేనే ప్రెస్ మీట్ పెట్టి నిజాలు మాట్లాడాలన్నారు. వినాయక నిమజ్జనం తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అవినీతి, అక్రమాల చిట్టా విప్పుతామన్నారు.
ప్రతి పనికి ఏదో ఒక లబ్ధి లేకుండా ఎమ్మెల్యే ఏ పని చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైన ప్రజలకు ప్రేమ్ సాగర్ రావు నిజాలను చెప్పాలని లేకపోతే బేషరతుగా క్షమాపణలు కోరాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.వర్షాలకు పంట నష్టం జరిగితే అంచనా వేయకుండానే డిప్యూటీ సీ ఏం, వ్యవసాయశాఖ మంత్రి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని ఎలా కలిశారో కూడా ఎమ్మెల్యేకు కనీస అవగాహన కూడా లేదని ఏద్దేవా చేశారు. పంట నష్టంపై ఒక అంచనాకు వచ్చాకే కేంద్ర మంత్రిని కలిసిన విషయం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలుసుకోవాలన్నారు.ఎమ్మెల్యే అవినీతి, అక్రమాల విషయంలో తన మాటలను వెనక్కి తీసుకుని మాకు క్షమాపణలు చెప్పాలని పునరుద్ఘాటించారు.