calender_icon.png 7 August, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవుల కోసం కాళ్లు పట్టుకోను!

06-08-2025 01:44:24 AM

  1. ఎవరి ఇంటికెళ్లి బతిమలాడను
  2. వేల కోట్లు దోచుకునే వాళ్లకే పెద్ద పదవులు కావాలి
  3. జూనియర్లకు మంత్రి పదవి
  4. నేను అడిగితే తప్పేంటి?
  5. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మునుగోడు, ఆగస్టు 5: మునుగోడు అభివృద్ధి కోసం మళ్లీ పదవి త్యాగానికైనా వెనుకాడనని, అవసరమైతే ఉప ఎన్నిక తెస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం చిమిర్యాల గ్రామంలో ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి మాట్లాడుతూ.. ‘వేల కోట్లు దోచుకునే వాళ్లకే పెద్ద పదవులు కావాలి, నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదు.

గత ప్రభుత్వంలో 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడు ప్రజల కాళ్లకాడికి తీసుకొచ్చిన చరిత్ర నాది. పదవి కంటే నాకు మునుగోడు ప్రజలే ముఖ్యం. నాకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడి, పది సంవ త్సరాలు కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన ప్రశ్నించి పదవి త్యాగం చేశా. పదవుల కోసం కాళ్లు పట్టుకునే రకం కాదు. కొందరు మంత్రి పదవి రాలేద ని మాట్లాడుతున్నానని అంటున్నారు.

ఒకవేళ పదవి కావాలనుకుంటే ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేవాడిని. మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే ఇక్కడి నుంచి పోటీ చేశా. పదవుల కోసం నేను ఎవరి ఇంటికి వెళ్లి బతిమలాడే రకం కాదు. నాకు కావాల్సింది ప్రజలు, వారి సంక్షేమమే. ప్రజలు తలదించుకునే పని ఎప్పటికీ చేయను. రాజగోపాల్‌రెడ్డి మా ఎమ్మెల్యే అని మునుగోడు ప్రజలు గర్వంగా తల ఎత్తుకునేలా వ్యవహరిస్తా’ అని వ్యాఖ్యనించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మునుగోడు నియోజకవర్గంలో ఒక్క ఇల్లు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఐదు సబ్‌స్టేషన్లు ప్రారంభించామని, మరో పది సబ్‌స్టేషన్ల కోసం ప్రపోజల్స్ పంపించామని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లాలో మునుగోడు చాలా వెనుకబడి ఉన్నదని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపైనా, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంపైనా ఉందన్నారు. 

ఆ స్థాయిలో ఉన్నానా?: మంత్రి వెంకట్‌రెడ్డి

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో ఉన్నానా? అని ఆయన సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తన సోదరుడికి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం హామీ ఇచ్చిందో తనకు తెలియదని ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు.