06-08-2025 10:38:55 PM
నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలం(Nagalgidda Mandal) శేరి దామరగిద్ద గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కరస్ గుత్తి ప్రాథమిక ఆసుపత్రి డాక్టర్ జువేరియా, ఐసీడిఎస్ సూపర్ వైజర్ ప్రశాంతి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా డాక్టర్ జూవేరియా మాట్లాడుతూ… తల్లిపాల వారోత్సవాలను వారం రోజులపాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తల్లి పాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఆమె చెప్పారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు తాగించకూడదని డాక్టర్ జువేరియా తెలిపారు.
బిడ్డ పుట్టిన గంటలోనే తల్లియొక్క పసుపు రంగు చిక్కటి పాలు (ముర్రుపాలు) అమృతం లాంటివని ఆమె పేర్కొన్నారు. వీటి ద్వారా బిడ్డకు అతిముక్యమైన పోషకాలు లభిస్తాయని తెలిపారు. తల్లిపాలు బిడ్డ శరీరానికి, మెదడు కూడా పోషణను ఇస్తుందన్నారు. తల్లి పాలలో వున్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలల్లో వుండవని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా తల్లిపాలు శిశువును న్యుమోనియా, అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని ఆమె చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు నిర్మల పుణ్యవతి, డాక్టర్ రాజశేఖర్, ఏఎన్ఏం సునీత, ఆశా కార్యకర్తలు సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.