హుజూరాబాద్ డంప్‌యార్డ్‌పై బీజేపీ యుద్ధభేరి
అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి
బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు
ముకరంపుర, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు.
తొలుత హుజూరాబాద్ ఈరోజు బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు. అనంతరం హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.






