30-12-2024 12:00:00 AM
నందా కర్నాటకి.. 1948లో ‘మందిర్’ సినిమాతో తొలిసారిగా చైల్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. ‘బేబీ నంద’గా గుర్తింపు పొందారు. 30 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 70కిపైగా చిత్రాల్లో నటించారు. నందా చక్కటి అందంతోపాటు అద్భుతమైన నటనను ప్రదర్శించేది. 1970లో ‘ఇతైఫాక్’ చిత్రంలో నందా నటనకుగానూ ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది.
నందా అందంతో పాటు చక్కటి నటనతో 1960, 70లలో వెండితెరను ఏలారు. హమ్ దోనో, గుమ్నా మ్, జబ్ జబ్ పూల్ ల్, ఛోటీ బహెన్, ధూల్ కా ఫూల్, భాభి, కాలా బజార్, కానూన్, ది ట్రైన్, ప్రేమ్ రోగ్.. వంటి చిత్రాలలో మరపురాని పాత్రలు పోషించారు నందా. అగ్ర హీరోలైన దేవానంద్, కిషోర్ కుమార్, అశోక్ కుమార్, రాజేష్ ఖన్నా హీరోల సరసన నటించింది.
ప్రముఖ దర్శకుడు వి.శాంతారాయ్‌కు నందా మేనకోడలు. ఆమె తండ్రి వినాయక్ దామోదర్ మరాఠీ దర్శకుడు. 1939లో మహారాష్ట్రలో జన్మిచిన నందా బాల్యంలోనే నటించడం మొదలుపెట్టారు. నందా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణార్థం సినిమాల్లోకి వచ్చింది. 1950లో ‘జగ్గు’ సినిమాతో తెరంగేట్రం చేసిన నందా తొలినాళ్లలో చెల్లెలి పాత్రలు పోషించారు.
ఆ తర్వాత హీరోయిన్‌గా చేశారు. తక్కువగా మాట్లాడటం నందా నైజం. కుటుంబమే ఆమె ప్రపంచం. ప్రముఖ నటి వహీదా రెహమాన్ ఆమెకు అత్యంత ఆప్తురాలు. ఆధునిక భావాలున్న పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నది. సినీ రంగంలో, బయటా చాలామందే ఆమెతో ప్రేమలో పడ్డా ఆమె పట్టించుకోలేదు.
బాలనటిగా పరిచయమై అరవయ్యా దశకంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా స్థిరపడింది. తల్లి, సోదరులు పెళ్లి చేసుకొమ్మని చెప్పినా వినలేదు నందా. తోబుట్టువులందరూ స్థిరపడేవరకు పెళ్లి చేసుకోనని మొండికేసింది.
మౌనంగా ఆరాధించాడు..
మన్మోహన్ దేశాయ్.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్. నందాను మనసు పూర్తిగా ప్రేమించాడు. ఆమె అమాయకమైన ముఖం. బాధ్యతగల నైజం నందాను అతను ప్రేమించేలా చేశాయి. కాని ఆమెతో తన ప్రేమను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాడు. కొన్నేళ్లపాటు నందాను అలా మౌనంగా ఆరాధిస్తూనే ఉన్నాడు తప్ప ఇష్టాన్ని ప్రకటించలేదు.
తాను చెప్పలేక.. ఆమె తెలుసుకోలేక ఆ ప్రేమ ముందుకు సాగేది లేదనుకున్న మన్మోహన్ దేశాయ్.. జీవన్‌ప్రభ గాంధీని పెళ్లి చేసుకున్నాడు. జీవన్‌ప్రభ ఆకస్మిక మరణంతో.. ఎక్కడలేని ఒంటరితనం అతడ్ని ఆవహించింది. నందా తలపులు అతడ్ని మరింత బాధించసాగాయి. తట్టుకోలేక నందా ప్రాణస్నేహితురాలైన వహీదాతో చెప్పాడు.
నందా ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననీ స్పష్టం చేశాడు. ఎలాగైనా తన స్నేహితురాలిని జతకూర్చాలి అన్న వహీదా ఆరాటం ఫలించింది. మన్మోహన్ దేశాయ్ మనసులోని మాట నందాకు చెప్పింది. ఆ ప్రేమ ఏనాటిదో కూడా వివరించింది వహీదా. స్నేహితురాలు చెప్పడంతో పెళ్లికి ఒప్పుకుంది నందా.
విధిరాత..
ఇది 1992 నాటి ముచ్చట. అప్పటికి నం దా వయసు 53.. మన్మోహన్ వయసు 55. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. త నంటే అతనికున్న ప్రేమకు ఆశ్చర్యపోయింది నందా. వెంటనే నిశ్చితార్థం అయిపోయింది. రెండేళ్లు గడిచాయి. పెళ్లి ముహూర్తాలూ నిర్ణయించుకోవాలనుకుంటున్న వేళ.. ఊహించ ని పరిణామం.. టెర్రస్ మీద నుంచి కిందపడి మన్మోహన్ చనిపోయాడు.
ఆ వార్త బాలీవుడ్‌కు షాక్. అలా 1992లో నడివయసులో నిర్మాత మన్మోహన్ దేశాయ్‌కి దగ్గరై 1994లో దేశాయ్ చనిపోయేంతవరకు ఆయనతో కలిసి జీవించారు. ప్రేమికుడిని తలచుకుని ఏడ్వాలా? విధిరాతను పట్టుకొని నిందించాలా? తెలియలేదు నందాకు.
ఇక ఆ క్షణం నుంచి తన ఇంటినే లోకం చేసుకుంది. బయటకు వెళ్లడమే మానేసింది. మన్మోహన్ పంచిన జ్ఞాపకాలతోనే జీవించింది. 2014 మార్చి 26న అంధేరీలోని తన నివాసంలో 75 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో ఆకస్మికంగా మృతి చెందారు.