calender_icon.png 25 January, 2026 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దెకు తెచ్చుకుందాం!

28-12-2024 12:00:00 AM

జీవితంలో ఒకేసారి జరిగే వేడుక పెళ్లి. అందుకే ఈ వేడుకలో ఆద్యంతం అందంగా కనిపించాలని కాబోయే వధువులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందమైన వెడ్డింగ్ లెహంగాలు, ఇతర దుస్తుల కోసం భారీగానే ఖర్చు పెట్టేస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మధ్య తరగతి అమ్మాయిలు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. అయితే దుస్తుల కోసం లక్షల్లో ఖర్చు పెట్టే బదులు అద్దెకు తీసుకొని పెళ్లి ముచ్చట తీర్చుకోవచ్చు అని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రియులు. దీని వల్ల పెళ్లి కష్టాలకు చెక్ పెట్టడమే కాకుండా ఖర్చును తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం అద్దెకు దుస్తుల ట్రెండ్ కొనసాగుతున్నా.. చాలామంది అమ్మాయిలు ఇష్టం చూపడం లేదు. దానికి కారణాలు ఏంటో తెలుసా..?

ఇటీవల కాలంలో వెడ్డింగ్ క్యాస్టూ మ్స్ అద్దెకు తీసుకోవడం ట్రెండ్‌గా మారింది. కేవలం ఒకేసారి మాత్రమే ధరించే దుస్తులకు లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకంటున్నారు. అందుకే అద్దెకు తీసుకోండి అని చెబుతున్నారు డిజైనర్స్. మనదేశంలో వివాహ దుస్తులను అద్దెకు ఇచ్చే మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జీవితంలో బాగా సెటిల్ అయినవారు, మిలీనియల్స్ ఎక్కువగా అద్దె దుస్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

భారతదేశం వెడ్డింగ్ రెంటల్ ట్రెండ్‌కు బాగా అనుగుణంగా ఉందని నిపుణులు అంటున్నారు. సోషల్ మీడియా, ఇన్‌ప్లూయెన్సర్ల ప్రభావంతో రెంటల్ ట్రెండ్ బాగా ఊపందుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. జైపూర్, లూథియానా, హైదరాబాద్ కూడా ఈ ట్రెండ్ విస్తరిస్తోంది. రాయ్‌పూల్ లాంటి చిన్న నగరాల్లో సైతం అద్దె ట్రెండ్ కనిపిస్తోంది. తక్కువ ఖర్చు, ఎక్కువ లాభాలు ఉండటంతో ఈ రెంటల్ ట్రెండ్ ఊపందుకుంది. 

తక్కువ ఖర్చు

“ఈకాలం అమ్మాయిలు పెళ్లి బట్టల కోసం ఎంతైనా ఖర్చుపెడుతున్నారు.  రెంటల్ ట్రెండ్‌కు ఆసక్తి చూపుతున్నవారు కూడా ఉన్నారు. బ్రైడల్ కోచర్ లాంటివి కొనాలంటే లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తోంది. వాటిని కొనే బదులు అద్దెకు తెచ్చుకుంటే వేల రూపాలను ఆదా చేయొచ్చు.

పొదుపు చేయడానికి ఇదొక మంచి అవకాశం కూడా. ప్రత్యేకించి ఒకసారి మాత్రమే ధరించే వస్త్రాలను అద్దెకు తీసుకోవడం ఉత్తమం. అద్దెకు బదులు వెడ్డింగ్ డ్రస్సును కొంటే ఎక్కువ కాలం జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైక్లీనింగ్ లాంటివి చేయాల్సి ఉంటుంది. అందుకే రెంటల్ డ్రస్సులు బెటర్‌” అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్

అయిష్టతకు కారణమిదే.. 

అద్దెకు బట్టలు తీసుకోవడం సాధారణ విషయమే అయినప్పటికీ మనదేశంలో పెళ్లి చేసుకోయే అమ్మాయిలు కొంత అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ముంబైకు చెందిన ఓ అమ్మాయి వెడ్డింగ్ లెహంగాను అద్దెకు తీసుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని కాబోయే అత్తమామ్మలకు చెబితే ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో మహిళల్లో లగ్జరీ ఫ్యాషన్ పెరిగింది.

దీంతో దుస్తులను అద్దెకు తీసుకోవడం పట్ల చిన్నచూపు చూస్తుండటం మరో కారణం. హైదరాబాద్‌కు చెందిన అనిత అనే అమ్మాయి తనకు ఇష్టమైన లెహంగాను అద్దెకు తెచ్చుకుంది. ఈమె సిటీ శివారులో ఉంటోంది. వెడ్డింగ్ తర్వాత తిరిగే ఇచ్చే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే అమ్మాయిలకు అద్దె దుస్తుల ఎంపిక నచ్చినప్పటికీ, ఇంట్లో పెద్దవాళ్లు వ్యతిరేకిస్తుండటంతో వెనకడుగు వేయాల్సివస్తోంది.

“భారతీయ వివాహ వ్యవస్థ లోతైంది. ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు ముడిపడి ఉంటాయి. పెళ్లి దుస్తులు అనేది భావోద్వేగాల పెట్టుబడి. వధువు తనకు తానుగా రాజీపడే అవకాశం లేదు. పెళ్లి రోజున వధువు ధరించే దుస్తులు ప్రత్యేకమైనవి. అందుకే రెంటల్ దుస్తులను వ్యతిరేకించాల్సి వస్తోంది” అని అంటున్నారు పెద్దలు. 

అద్దె బెస్ట్ ఛాయిస్

ప్రస్తుతం పెళ్లికూతుళ్లు, వరుడి సోదరీమణులు, వధువు తల్లితో సహా వివాహ అతిథులకు దుస్తులను అద్దెకు ఇవ్వడం పెద్ద హిట్ అయ్యింది. ప్రతి కుటుంబ వివాహానికి కొత్త దుస్తులను కొనడం లేదా కుట్టడం సాధ్యం కాదు.

ఫ్యాషన్ పట్ల బలమైన అభిరుచి ఉన్నవారు సైతం భారీగా డబ్బులు ఎక్కువ పెట్టడానికి ఇష్టపడటం లేదు. అయితే అంతిమంగా వివాహ దుస్తులను అద్దెకు తీసుకోవడం లేదా కొనుగోలు చేయాలనే నిర్ణయం వ్యక్తిగత ప్రాధాన్యత కిందకు వస్తుంది. కానీ ఏదేమైనా అద్దె ట్రెండ్ వల్ల నష్టాల కంటే లాభాలే ఉన్నాయి. 

క్వాలిటీని బట్టి ధరలు

వివిధ నగరాల్లో డ్రెస్ వర్త్‌ను బట్టి డబ్బులు డిపాజిట్ ఉంటుంది. డ్యామేజీ, బర్న్ కాకుండా కస్టమర్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రూ.70వేల విలువ జేసే డ్రెస్సు ఐదు వేలకు అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. రూ.50వేలు ఉన్నది 3,500 చార్జీ చేస్తారు. రూ.25వేల డ్రెస్సు రెండు వేలకు అద్దెకు ఇస్తారు.

ఇలా అత్యధిక విలువ జేసే దుస్తులన్నీ తక్కువ ధరలో అద్దెకు తీసుకోవచ్చు. ఆయా వ్యాపార నిర్వాహకులు, ఫ్యాషన్ డిజైనర్లు తమ దుస్తులను మార్కెటింగ్ చేసుకుంటూ కస్టమర్లకు ఆకర్షిస్తున్నారు.