క్వార్టర్స్‌కు నిషాంత్, సచిన్
బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు చివరి అవకాశంగా భావిస్తున్న వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయర్స్‌లో భారత బాక్సర్లు నిషాంత్, సచిన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. మంగళవారం 71 కేజీల ప్రిక్వార్టర్స్ ఫైనల్లో నిషాంత్ రిఫరీ స్టాప్ ది కంటెస్ట్ (ఆర్‌ఎస్సీ) ద్వారా విజేతగా నిలిచాడు. మంగోలియాకు చెందిన ఒట్గోన్‌బాటర్‌పై నిషాంత్ పంచ్‌ల వర్షం కురిపించాడు. బౌట్ ప్రారంభమైన 2 నిమిషాల్లోనే నిషాంత్ జాబ్స్, క్రాస్ హుక్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. దీంతో రిఫరీ ఆర్‌ఎస్సీ ద్వారా నిషాంత్‌ను విజేతగా ప్రకటించాడు. ఇక మరో భారత బాక్సర్ సచిన్ సివాచ్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. 57 కేజీల విభాగంలో సచిన్ 5 ఫ్రెడ్రిక్ జెన్సెన్ (డెన్మార్క్)ను చిత్తు చేశాడు. అయితే అభినాష్ జమ్వాల్ మాత్రం రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు.






