13-11-2025 09:57:13 PM
కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): చదువుకోవడానికి అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు వచ్చిన పసి బాలుడు బిల్డర్ నిర్లక్ష్యం వలన మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామానికి చెందిన దుంపల నవీన్-మీనా దంపతులకు ఆకాష్(7) అనే కుమారుడు ఉన్నాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భౌరంపేట్ లోని విఎన్ఆర్ వెంచర్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ లోని పనిచేస్తున్న అమ్మమ్మ, తాతయ్య దగ్గరే ఆకాష్ ఉంటూ గాయత్రి స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్నాడు. గురువారం అపార్ట్మెంట్ దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గేట్ మీద పడడంతో తలకి తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. బిల్డర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.