13-11-2025 11:07:37 PM
దౌర్జన్యంగా వసూళ్లు చేస్తున్నారు
హన్మకొండలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆందోళన
కలెక్టర్లు, సీపీకి వినతిపత్రాలు
హనుమకొండ (విజయక్రాంతి): విద్యార్థి సంఘాల ముసుగులో కొంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆరోపించాయి. చెప్పినా వినకుండా దాడులకు కూడా వెనుకాడటం లేదని, ఇలా చేస్తే పాఠశాలలు ఎలా నడపాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ కుమార్ పల్లి లోని స్మైల్ డీజీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై పీ డీ ఎస్ యూ విద్యార్థి సంఘ నాయకుల దాడికి నిరసనగా శుక్రవారం నాడు ప్రయివేటు పాఠశాలలు బంద్ కు పిలుపునిచ్చి యాజమాన్యాలు ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాయి. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లో డీ ఆర్ వో కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో కష్టంగా ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్న తమపై విద్యార్థి సంఘాల పేరుతో దాడులు చెయ్యడం దారుణం అని అన్నారు. చందాలు ఇవ్వకుంటే దౌర్జన్యాలు చెయ్యడం, వేధించడం తగదని అన్నారు. నిన్న స్మైల్ డీజీ స్కూల్ లో విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం వచ్చారని,సదరు స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మతో వాగ్వాదం జరిపారని, ఆగ్రహంతో అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చెయ్యడమే కాకుండా చెయ్యి కూడా చేసుకున్నారని అన్నారు. ఇదంతా సీసీ టీవీలో కూడా రికార్డు అయిందని అన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందించారు.
అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి సైతం విద్యార్థి సంఘాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర కోశాధికారి రాఘవేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు చల్లా నాగార్జున రెడ్డి, ట్రస్మా భూపాల్ పల్లి అధ్యక్షుడు సాంబయ్య, మహబూబాద్ అధ్యక్షుడు ఏకాంతం గౌడ్, జనగాం అధ్యక్షుడు వెంకటరెడ్డి, ములుగు అధ్యక్షుడు వీరమల్లు, సిద్దిపేట నాయకులు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ట్రస్మా అధ్యక్షుడు కొమురయ్య, హనుమకొండ జిల్లా ట్రస్మా ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కోశాధికారి ముక్తేశ్వర్, హనుమకొండ జోన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, హసన్పర్తి జోన్ అధ్యక్షుడు ఏ. రాంబాబు, పరకాల జోన్ అధ్యక్షుడు రమేష్, కాజీపేట జోన్ అధ్యక్షుడు శ్రీనివాస్, టీపీజేఎంఏ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుమాధవ్, ట్రస్మా చీఫ్ అడ్వైజర్ నారాయణ రెడ్డి, అడ్వైజర్ కే. భూపాల్ రావు, పరంజ్యోతి, హడుప్సా అధ్యక్షులు టి. బుచ్చిబాబు, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.