15 April, 2026 | 5:17 AM

మహబూబాబాద్ ఘటన: మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

19-02-2026 12:00 AM
  1. తనతో పెళ్లికి నిరాకరించిందుకు ఘాతుకం   
  2. ఇద్దరికీ నిప్పంటుకొని తీవ్ర గాయాలు 
  3. కురవి మండలం మోదుగుల గూడెంలో ఘటన

మహబూబాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): సహజీవనం చేస్తున్న వివాహితను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేయడంతో నిరాకరించిన ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పటించిన ప్రియుడు కూడా మంటల్లో చిక్కుకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధితుల బంధువుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి భార్య రెండేళ్ల క్రితం చనిపోయింది. ఆమె మరణానంతరం అంజయ్య జిల్లా కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న ఓ మహిళతో పరిచయం పెంచుకొని సహజీవనం చేయసాగాడు. ఈ క్రమంలో ఆమెను వివాహం చేసుకోవాలంటూ వేధిస్తుండగా తాను పెళ్లి చేసుకోలేనని, తనకు భర్త ఉన్నాడని నిరాకరించింది.

అతని వేధింపులు తీవ్రం కావడంతో కొద్ది నెలల క్రితం మహబూబాబాద్ విడిచిపెట్టి ఇతర ప్రాంతానికి వెళ్లి నివసిస్తోంది. ఈ క్రమంలో మేడారం జాతర సందర్భంగా పుట్టింటికి వచ్చిన ఆ మహిళ విషయం తెలుసుకున్న అంజయ్య మంగళవారం అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు దిగాడు.

దీనికి ఆమె ససేమిరా అనడంతో వెంట తీసుకు వెళ్లిన పెట్రోల్ చల్లి నిప్పంటించగా ప్రమాదవశాత్తు పెట్రోలు అంజయ్యపై పడి మంటలు ఇద్దరికీ అంటుకున్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు